మాఫియా రాజ్యం.. రాజ భోజ్యం! | National Green Tribunal issues notice on sand mining in Papaghni | Sakshi
Sakshi News home page

మాఫియా రాజ్యం.. రాజ భోజ్యం!

May 21 2026 5:44 AM | Updated on May 21 2026 5:47 AM

National Green Tribunal issues notice on sand mining in Papaghni

వైఎస్సార్‌ కడప జిల్లా చక్రాయపేట మండలం కుమార కాలువ వద్ద పాపాఘ్ని నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు

పాపాఘ్నిలో ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) కన్నెర్ర  

వైఎస్సార్‌ జిల్లాలో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో విఘాతం కలుగుతుండటంతో ఎన్జీటీని ఆశ్రయించిన ఓ రైతు  

క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌కు ఆదేశం 

కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదుల్లోనూ ఇదే రీతిలో ఇసుక దోపిడీ

ఇసుక మాఫియాపై ఎన్జీటీలో కేసులు వేసేందుకు ఎక్కడికక్కడ సిద్ధమవుతోన్న రైతులు 

వైఎస్సార్‌ జిల్లాలో చెయ్యేరు, పెన్నా, పాపాఘ్ని, చిత్రావతి నదులతో పాటు బెరైటీస్‌ ఖనిజాన్ని దోచేస్తున్న టీడీపీ నేతలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా  

రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు.. జేసీబీలు, పొక్లెయిన్ల ద్వారా రేయింబవళ్లు తవ్వకాలు, రవాణా 

వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక 

రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు.. జేసీబీలు, పొక్లెయిన్ల ద్వారా రేయింబవళ్లు తవ్వకాలు, రవాణా 

వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక 

ఫలితంగా నదీ గర్భాలకు తీవ్ర విఘాతం.. ఎండిపోతున్న బోర్లు, బావులు 

ఫలితంగా నదీ గర్భాలకు తీవ్ర విఘాతం.. ఎండిపోతున్న బోర్లు, బావులు 

గుక్కెడు మంచినీటికి నోచుకోలేక పోతున్న సమీప గ్రామాల ప్రజలు  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పాపాఘ్ని నదీ గర్భంలో భారీ పొక్లెయిన్‌లతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ.. అక్రమంగా రవాణా చేస్తూ.. యథేచ్ఛగా దోచేస్తుండటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ–చెన్నై) కన్నెర్ర చేసింది. పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగించే ఈ అక్రమ తవ్వకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి సహా అన్ని నదులు, వాగులు, వంకల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల దన్నుతో ఇసుకాసురులు భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ.. అక్రమంగా రవాణా చేస్తూ.. అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీ చేస్తుండటంపై పర్యావరణ వేత్తలు, రైతులు ఎన్జీటీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 

ఈ క్రమంలో వైఎస్సార్‌ జిల్లా చక్రాయిపేట మండలం కుమ్మరకాలవ వద్ద పాపాఘ్ని నదిలో భారీ పొక్లెయిన్‌లతో ఇసుకను తవ్వేస్తూ వందలాది భారీ టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతోపాటు పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలుగుతోందని కొవ్వూరు శ్రీధర్‌రెడ్డి అనే రైతు ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, వాయు కాలుష్య నియంత్రణ చట్టం–1981, జల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చట్టం–1974, ఈఐఏ9 (పర్యావరణ ప్రభావ అంచనా) నోటిఫికేషన్‌–2006, ఇసుక మైనింగ్‌మార్గదర్శకాలు–2016, ఇసుక తవ్వకంపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2020లో జారీ చేసిన మార్గదర్శకాలు.. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ, సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన తీర్పులను తుంగలో తొక్కుతూ.. పాపాఘ్ని నదీ గర్భంలో ఇసుకను దోచేస్తున్నారంటూ రైతు శ్రీధర్‌ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన వాదనతో ఎన్జీటీ ఏకీభవించింది. 

ఇసుక అక్రమ తవ్వకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ నియమించే ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి నియమించే మరో ప్రతినిధితో జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించి, నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాయింట్‌ కమిటీకి నిర్దేశించింది. జాయింట్‌ కమిటీకి ఇసుక అక్రమ తవ్వకాల వివరాలు, ఆధారాలు ఇవ్వాలని రైతు శ్రీధర్‌రెడ్డికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. 

నదులను చెరబట్టిన ‘పచ్చ’ ముఠా 
రాష్ట్రంలో ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడానికి జిల్లా స్థాయిలో జిల్లా ఇసుక కమిటీల(డీఎల్‌ఎస్‌ఈ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. గనులు, భూగర్భ జలాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఏ ప్రాంతంలో ఇసుక తవ్వుకోవచ్చో సర్వే చేసి, పర్యావరణ అనుమతులు ఇచ్చేది ఈ కమిటీనే. ఈ కమిటీ అనుమతి ఇచ్చిన ప్రదేశాలతోపాటు అనుమతి ఇవ్వని ప్రాంతాల్లోనూ గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి నదీ పరీవాహక ప్రాంతాలతోపాటు చిన్న చిన్న వాగులు, వంకల్లో కూడా పచ్చ ముఠా యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తోంది. 

నిబంధనల ప్రకారం నదులు, వాగులు, వంకల్లో అనుమతి ఇచ్చిన క్వారీలలో కేవలం కూలీలతో మాత్రమే ఇసుకను తవ్వించాలి. కానీ.. టీడీపీ నేతలతో కూడిన ఇసుక మాఫియా భారీ హిటాచీలు, పొక్లెయిన్‌లతో నదీ గర్భాన్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దాంతో నదుల స్వరూపం మారిపోతోంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రీచ్‌లలో కూడా కేవలం ఒక మీటరు లోతు వరకు మాత్రమే ఇసుక తీయాలి. కానీ.. భారీ పొక్లెయిన్‌లు, హిటాచీలతో 10 అడుగుల కంటే ఎక్కువ లోతు తవ్వేయడం వల్ల నదీ గర్భం విధ్వంసానికి  గురైంది. 

నదులను విధ్వంసం చేస్తూ, ఇసుకను అక్రమంగా రాష్ట్రంతోపాటు సరిహద్దు రాష్ట్రాలకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ భారీ ఎత్తున దోచేస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో సమీప ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. నదిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరక్క జంతువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. తాగునీటి కోసం జనం తల్లడిల్లుతున్నారు.  

ఎన్జీటీకి భారీ ఎత్తున ఫిర్యాదులు  
దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రాయలసీమ ప్రాంతంలో పెన్నా బేసిన్‌ విస్తరించింది. పెన్నాకు పాపాఘ్ని ఉప నది. పాపాఘ్ని పరీవాహక ప్రాంతంలో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఆ నదిలోనే ఇసుకాసురులు అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తుండటం వల్ల నదీ గర్భం ఒట్టిపోయింది. ఇక కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా తీవ్ర స్థాయిలో పేట్రేగిపోతోంది. సీఎం చంద్రబాబు కృష్ణా  నదీ గర్భంలో నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇసుకను అడ్డగోలుగా భారీ యంత్రాలతో తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. 

రాష్ట్రంలో కృష్ణా బేసిన్‌తోపాటు గోదావరి బేసిన్‌లోనూ ఇసుక మాఫియా అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తూ తెలంగాణకు తరలిస్తూ భారీ ఎత్తున దోచేస్తోంది. వంశధార, నాగావళి, పంపా, ఏలేరు వంటి నదుల్లోనూ ఇసుక మాఫియా తడాఖా చూపిస్తోంది. నదీ గర్భాలను ఇసుక మాఫియా తవ్వేస్తుండటం వల్ల పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలగడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం వల్ల బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. ఇది లక్షలాది మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఇదే అంశాలను ఎత్తిచూపుతూ ఇసుక మాఫియా అక్రమాలపై ఎంతో మంది రైతులు ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వందలాది మంది రైతులు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు.  

బెదిరించి నిత్యం 50 టన్నుల ఖనిజం దోపిడీ 
వేంపల్లె మండలం తాళ్లపల్లె సమీపంలో ఉన్న నియామతుల్లా మైన్‌లో దౌర్జన్యంగా బెరైటీస్‌ను దోపిడీ చేస్తున్నారు. గని యజమాని అనుమతి లేకుండా అక్రమంగా మైనింగ్‌ కొనసాగుతోంది. అదే ప్రాంతంలోని వేంపల్లె, వేముల మండలాలకు చెందిన టీడీపీ నేతలు మూడు చోట్ల యజమానితో సంబంధం లేకుండానే మైనింగ్‌ చేస్తున్నారు. నిత్యం కనీసం 50 టన్నుల ఖనిజాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా రౌడీల పహారాలో గనుల్లో చొరబడి అక్రమ మైనింగ్‌ కొనసాగిస్తున్నారు. 

టన్నుకు రూ.3,200 రాయల్టీ చెల్లించాల్సి ఉండగా.. ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఒక్క నియామతుల్లా మైన్‌ ద్వారానే రోజుకు రూ.1.6 లక్షల రాయల్టీ ఫీజు రావాల్సి ఉండగా.. ప్రభుత్వానికి దక్కడం లేదు. ఇదే పరిస్థితి టిఫెన్‌ బెరైటీస్‌లోనూ నెలకొంది. రాత్రి వేళల్లో మైనింగ్‌ చేస్తూ బెరైటీస్‌ ఖనిజాన్ని తరలించుకుపోతున్నారు. అక్రమ మైనింగ్‌పై నియామతుల్లా గత ఏడాది జూలై 31 నుంచి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. జిల్లా మైనింగ్‌ ఏడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్పీ, కలెక్టర్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ (మైన్స్‌), డీజీపీ, కేంద్ర మైన్స్‌ అండ్‌ జియాలజీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్టదాఖలయ్యాయి. 

పైగా టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి పేరిట మైనింగ్‌ అగ్రిమెంట్‌ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ ద్వారా సీజ్‌ అయిన బెరైటీస్‌ ఖనిజాన్ని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టి) నుంచి ఎంబసీ గ్రూపు (టిఫిన్‌ కంపెనీ) వేలంలో కొనుగోలు చేసింది. వేముల వద్ద ఆ కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఖనిజం లోంచి సంక్రాంతి పండుగ రోజున రాత్రికి రాత్రి రూ.10 కోట్లు విలువైన 3,500 టన్నుల ఖనిజాన్ని పదుల సంఖ్యలో లారీల ద్వారా ఎత్తుకెళ్లడం నివ్వెర పరుస్తోంది. 

మొత్తంగా రూ.100 కోట్లు విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి జిల్లాలో ఇసుక, మైనింగ్‌ మాఫియా ఏ స్థాయిలో పాతుకుపోయిందో స్పష్టమవుతోంది. అక్రమ మైనింగ్‌పై గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.  

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు  
పులివెందుల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌ కొనసాగుతోంది. ప్రభుత్వానికి రాయల్టీ ఫీజు దక్కడం లేదు. మైన్‌ ఓనర్‌కు ఆదాయం కొల్లగొట్టుతున్నారనిఫిర్యాదు చేస్తే, అధికారులు టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవితో మైనింగ్‌ ఒప్పందం చేసుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. సేఫ్టీ రూల్స్‌ పాటించకుండా అక్రమంగా బ్లాస్టింగ్, మైనింగ్‌ కొనసాగిస్తున్నారు. ప్రమాదాలు సంభవిస్తే నాపైనే కేసులు నమోదు చేస్తున్నారు. భవిష్యత్‌లో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు చేసి పెనాల్టీ వేస్తే ఎవరు చెల్లించాలి? ఇవన్నీ నేను పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఎలాంటి స్పందన లేదు.      – ఎండీ నియామతుల్లా, మైన్‌ యజమాని  

నదులను చెరబట్టిన పచ్చ తోడేళ్లు
సాక్షి ప్రతినిధి, కడప : వైఎస్సార్‌ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చెయ్యేరు, పెన్నా, పాపాఘ్ని, చిత్రావతి నదులను టీడీపీ నేతలు చెరబట్టారు. మరోవైపు బెరైటీస్‌ ఖనిజం దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమార్కులు అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాజంపేట–రాయచోటి మార్గంలోని బాలరాచపల్లె వద్ద చెయ్యేరులో నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 

పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తప్పని పరిస్థితిలో గత నెలలో రాజంపేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 12 ఇసుక అక్రమ లారీలను సీజ్‌ చేశారు. బాలరాచపల్లె హైలెవల్‌ వంతెన సమీపంలోనే అడ్డగోలుగా హిటాచీలతో ఇసుక తవ్వకాలు సాగిస్తుండటం విస్తుగొలుపుతోంది. తవ్వకాల కారణంగా సమీప గ్రామ ప్రజలకు తాగునీరు కూడా కరువైంది.   కొండాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, వీరపునాయునిపల్లె ప్రాంతాల్లో ఏడాదిన్నరగా యథేచ్ఛగా నదుల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి.

ఏకంగా నదుల్లోకి రహదారులు ఏర్పాటు చేసి మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. పాపాఘ్ని నదిలో కోగటం వద్ద ఇసుక అక్రమ రవాణా వ్యవహారంపై ఆ గ్రామానికి చెందిన జి.వీరారెడ్డి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. తక్షణమే తవ్వకాలను ఆపాలని ఎన్జీటీ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించింది. అయినా ఆ ఆదేశాలు అమలు కాలేదు.   

ఇసుక మారీచులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూటమి నేతలు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. యంత్రాల సాయంతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి నదీ పరీవాహక గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకు 100–120 ట్రిప్పుల ఇసుక తరలిపోతోంది. తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాలు, సత్యవేడు నియోజకవర్గంలో ఇదే రీతిలో దందా సాగుతోంది.   

సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు మండలాల పరిధిలోని స్వర్ణముఖి నదిలో కలవకూరు, భీమవరం వద్ద యంత్రాలు పెట్టి మరీ ఇసుక తవ్వుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో రెండు రోజులు ఆపినట్టే ఆపి మళ్లీ తవ్వకాలు మొదలుపెట్టారు. 

పైగా అక్రమ తవ్వకాలను వ్యతిరేకించిన కిలివేటి సంజీవయ్య, కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు మరో 11 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం వావిల్‌తోట వంకలో జేసీబీల ద్వారా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి.. టిప్పర్‌ ఇసుక రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు సాగుతున్నాయి.  

తవ్వుకో.. తమ్ముడూ! 
పులివెందులలో గనులను చెరబట్టిన టీడీపీ నేతలు 
సాక్షి టాస్క్ ఫోర్స్‌:  టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో బెరైటీస్‌ నిక్షేపాల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. లీజు అనుమతులు పొందిన వారైనా.. తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లోనే మైనింగ్‌ చేయాలనే నిబంధన పెట్టారు. వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిన్నరగా అక్రమ మైనింగ్‌కు తెరతీశారు. అనధికారిక మైనింగ్‌ బ్లాస్టింగ్‌ల వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు వ్యక్తులకు తీవ్రగాయాలవుతుండగా.. అక్కడక్కడా మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడల్లా స్థానిక అధికారులు పంచాయితీలు చేసి కేసులు లేకుండా చక్కబెడుతున్నారు. 

మైన్‌ యజమానులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి మైనింగ్‌ చేసేందుకు తెలుగు తమ్ముళ్లతో ఒప్పందం చేసుకోవాలని బెదిరింపులకు సైతం దిగుతున్నారు. లేదంటే వేధింపులకు గురిచేస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అంగీకారం ఉంటేనే మైనింగ్‌ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో కాల్‌ట్యాక్స్‌ కుటుంబం 1970 దశకం నుంచి మైనింగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎస్‌ఎండీ రహంతుల్లా కుటుంబానికి చెందిన ఎండీ కరంతుల్లాకు వేంపల్లె మండలం తాళ్లపల్లెలో 6.48 హెక్టార్లలో బెరైటీస్‌ మైన్‌కు 1971లో మైనింగ్‌ లీజు దక్కింది. 

రహంతుల్లా మరణించాక అతడి కుమారుడు నియామతుల్లా పేరిట మైన్‌ బదిలీ అయ్యింది. 2024లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు తమ్ముళ్లు అతడిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. మైనింగ్‌ చేసేందుకు తాము చెప్పిన వాళ్లతో ఒప్పందం చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి అంగీకారం లేకుండా మైనింగ్‌ చేయొద్దని హూంకరిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement