నేత్రదానం.. ఎవరు చేయొచ్చు?.. కార్నియా ఎన్ని గంటల్లోపు...

National Eye Donation Fortnight every year from 25th August to 8th September - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: వ్యక్తి మరణించిన తర్వాత కళ్లను దానం చేస్తే.. ఆ కళ్లు మరొకరి జీవితంలో వెలుగును ప్రసాదిస్తాయి. దాతల కళ్లు పునర్జన్మను సంతరించుకుని అంధకారాన్ని పారదోలే కాంతిపుంజంగా మారుతాయనడంలో సందేహం లేదు. ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటారు. అంతటి ప్రధానమైన కళ్లను మరణించాక మట్టిపాలు చేసేకంటే, దానం చేయడం ఉత్తమం. ఆగస్టు 25 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకూ జాతీయ 37వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేత్ర దానం ప్రాధాన్యం, ఆవశ్యతకను ప్రజలందరికీ తెలియజేయడం, ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయడం ఈ పక్షోత్సవాల ముఖ్యోద్దేశం. కార్నియాల అవసరానికి, సేకరణకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూరించడానికి ఈ సందర్భంగా ప్రయత్నిస్తారు. కార్నియా ద్వారా అంధత్వానికి గురి కాకుండా ప్రజలను అప్రమత్తం చేయడం. ప్రజలను నేత్రదానానికి సన్నద్ధం చేయడం కూడా ఈ పక్షోత్సవాల్లో లక్ష్యాల్లో కొన్ని. 

కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. నేత్రదానం చేసే వారి సంఖ్య మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ఈ వ్యత్యాసం ఏడాదికేడాదీ పెరుగుతోంది. నేత్ర దానానికి ముందుకు వచ్చిన వారిలో కొందరు మృత్యువాత పడిన సమయానికి వారి కళ్లను దానం చేయలేకపోతున్నారు. కొందరు బాధ, దుఃఖంలో మర్చిపోతే, మరికొందరి కళ్లను బంధువులు, కుటుంబ సభ్యులు మూఢనమ్మకాలతో దానం చేయడానికి ఇష్టపడడం లేదు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ లెక్కల ప్రకారం 2017 నుంచి ఇప్పటి వరకూ 2,611 మంది నుంచి కార్నియాలు సేకరించగా, 2,267 మందికి అమర్చారు. ఇది మరింత పెరగాలని, నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

40 శాతం మందికి కార్నియా సమస్యలు 
కంటి ముందు నల్లటి భాగాన్ని కప్పి ఉంచే పొరను కార్నియా అంటారు. ఏటా వందల మంది కార్నియా అంధులుగా మారుతున్నారు. 
వీరిలో 35 శాతం మంది యువతీ యువకులు, ఐదు శాతం చిన్నపిల్లలే. 
విటమిన్‌–ఎ లోపం, పౌష్టికాహార లేమి, ప్రమాదాలు, గాయాలు, శస్త్రచికిత్సలతో వచ్చే ఇన్ఫెక్షన్లతో కార్నియా అంధత్వం వస్తుంది. 
దీర్ఘకాలిక కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే వారిలో కూడా కార్నియా అంధత్వం ఏర్పడే అవకాశముంది. 
కార్నియా అంధత్వానికి కార్నియా మార్పిడే మార్గం. 

ఆరు గంటల్లో సేకరించాలి 
మనిషి మరణిస్తే ఆరు గంటల్లోగా శరీరం నుంచి కార్నియాను సేకరించాలి. నేత్రదానం అనేది 15–20 నిమిషాల్లో పూర్తయ్యే సామాన్య ప్రక్రియ. మరణించిన వారి నుంచి కేవలం కార్నియాను మాత్రమే తీసుకుంటారు. మొత్తం కంటిని కాదనే విషయాన్ని గమనించాలి. చాలా మందిలో కన్ను మొత్తాన్ని తీసుకుంటారన్న అపోహ ఉంది. అది అవాస్తవం. నేత్రదానం తర్వాత ఎలాంటి వికృతం ఉండదు.

ఎందుకంటే కళ్లను తొలగించిన వెంటనే సహజమైన కన్నుల మాదిరిగా కనిపించే కృత్రిమ కన్నులను వెంటనే మృతదేహానికి అమరుస్తారు. దీనివలన అంతిమ సంస్కారాలకు ఇబ్బంది ఉండదు. ముందుగా ఐ బ్యాంక్‌ వారికి సమాచారం ఇవ్వాలి. వారు వచ్చేలోగా నేత్ర దాత రెండు కనురెప్పలను మూసివేసి, దూది లేదా మెత్తటి వస్త్రాన్ని వాటిపై కప్పి ఉంచాలి. మృతదేహాన్ని ఫ్రీజర్‌ బాక్సులో పెట్టినా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాన్‌ గాలి కింద మృతదేహాన్ని ఉంచరాదు. ఆర్‌కే ద్రావకంలో సేకరించిన కార్నియాను భద్రపర్చి 28 రోజుల్లోగా వాడుకోవచ్చు. 

18 ఏళ్లు నిండిన వారు మొదలు.. 
18 ఏళ్లు నిండిన వారు వయస్సుతో సంబంధం లేకుండా నేత్రదానం చేయొచ్చు. ఏ వయస్సు వారైనా, కంటి అద్దాలు ధరించిన వారైనా, షుగర్‌ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటు ఉన్న వారైనా మరణానంతరం నేత్రదానం చేయొచ్చు. ప్రమాదవశాత్తూ, గుండె జబ్బులు తదితర దీర్ఘకాలిక జబ్బులతో మరణించిన వారు, సహజ మరణం పొందిన వారు నేత్రదానం చేసేందుకు అర్హులు. 

ఎవరు అనర్హులంటే.. 
క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు, హెచ్‌ఐవీ, కామెర్లు, కుష్ఠు వ్యాధి, రుబెల్లా, సిఫిలిస్‌ వంటి వ్యాధిగ్రస్తులు, కరోనా పాజిటివ్, హెపటైటిస్‌ ఉన్న వారు నేత్రదానానికి అనర్హులు. పాము, కుక్క కాటు వల్ల మరణించిన వారు, కంటి పాపపై తెల్లని మచ్చలు, కంటిలో నీటి కాసుల వ్యాధి ఉన్న వారు కూడా అనర్హులు. 

అవగాహన కల్పిస్తున్నాం 
కలెక్టర్‌ హిమాన్షు శుక్లా నేతృత్వంలో నేత్రదానంపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పిస్తున్నాం. మృతి చెందిన ప్రతి ఒక్కరి కళ్లకు సంబంధించిన కార్నియాను తీసుకుని అమరిస్తే ఇద్దరికి చూపు వస్తుంది. నేత్రదానానికి ప్రజలు ముందుకు వస్తున్నా.. మృతి చెందిన సమయంలో పలు కారణాలతో నేత్రాల సేకరణపై సమాచారం ఇవ్వడం లేదు. మరికొందరు ముందస్తు సమాచారం ఇవ్వకున్నా, మృతి తర్వాత మరో ఇద్దరికి చూపునివ్వాలని కళ్లను దానం చేస్తున్నారు. 
– డాక్టర్‌ మల్లికార్జునరాజు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, అమలాపురం 

కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరిగే ఆస్పత్రులివే.. 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కాకినాడ శ్రీకిరణ్‌ కంటి ఆస్పత్రి, రాజమహేంద్రవరం గౌతమీ నేత్రాలయంలో కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తున్నారు. అలాగే కాకినాడ నయన, రాజమహేంద్రవరం అకిరా ఆస్పత్రుల్లో కూడా కార్నియా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌ ద్వారానే కార్నియాలను గత పదేళ్లుగా సేకరిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top