రెండు రోజుల పర్యటన.. విశాఖకు ప్రధాని, సీఎం..

Narendra Modi and YS Jaganmohan Reddy Visakha Tour On 11th November - Sakshi

సాయంత్రం 7.25 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ  

స్వాగతం పలకనున్న గవర్నర్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ 

12వ తేదీన ఏయూ మైదానంలో బహిరంగ సభ   

దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. పీఎం, సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్న దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా.. 
11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7.25 గంటలకు విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకుంటారు. తర్వాత చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్‌ హౌస్‌)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు. 

గవర్నర్‌ విశ్వభూషణ్‌ రాక: రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 11వ తేదీ సాయంత్రం 4.20 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నోవాటెల్‌ హోటల్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి 7 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం నోవాటెల్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 12న 10.20 గంటలకు ఏయూకు చేరుకొని ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత గన్నవరం పయనమవుతారు.
 
సీఎం జగన్‌ పర్యటన సాగేదిలా.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top