దూదేకుల కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ఎప్పుడిచ్చారు?
ఐటీ పార్కుల పేరుతో వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి కుట్ర..
ఇఫ్తార్‌లో చంద్రబాబు అబద్ధాలపై ముస్లిం నేతల మండిపాటు
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్నానని, వక్ఫ్ భూములను కాపాడుతామని ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముస్లిం సమాజం మండిపడుతోంది. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు... 2024 ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు కూడా గాలికొదిలేశారని మైనారిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్టు అబద్ధాలు చెబుతూ ముస్లిం మైనారిటీలను ఇంకెంతకాలం మోసం చేస్తావ్ బాబూ... అంటూ ప్రశి్నస్తున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. – సాక్షి, అమరావతి
దూదేకులకు రూ.వంద కోట్లు ఎప్పుడిచ్చారు?
నూర్‌బాషాల (దూదేకుల) ఆర్థిక ఉన్నతి కోసం ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తానని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయలేదు. మళ్లీ అదే హామీని 2024 ఎన్నికల్లోనూ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నూర్‌బాషాలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
తర్వాత ఆరు నెలలకు జీవో ఇచ్చారు. కానీ, దానిని అమలు చేయకుండా పక్కన పడేశారు. అయినా దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఇఫ్తార్ విందులో చంద్రబాబు ప్రకటించడం పచ్చి మోసం. అల్లా సాక్షిగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు అక్కడ ఉన్న పెద్దలు కూడా అడ్డుచెప్పకపోవడం సరికాదు. – షేక్ దస్తగిరి, ఏపీ నూర్‌బాషా(దూదేకుల) జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
ఐటీ పార్కుల కోసం వక్ఫ్ భూములా?
వక్ఫ్ భూములను కాపాడుతున్నానని, ముస్లింల కోసం ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తున్నానని చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధం. ముస్లిం సమాజానికి ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూములను ఐటీ పార్కుల పేరుతో అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇమామ్, మౌజన్‌లకు ఆరు నెలల బకాయిలు విడుదల చేసినట్టు గొప్పులు చెబుతున్న చంద్రబాబు... దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 1,500 మసీదుల దరఖాస్తులను పరిశీలించి వాటిలో పనిచేసే ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఎందుకు మంజూరు చేయడంలేదు? మైనారిటీలకు మూడు బడ్జెట్లలో ఎంత కేటాయించారు? దానిలో ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. – షేక్ నాగుల్‌మీరా, ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు
అబద్ధాలు చెబితే ముస్లిం సమాజం హర్షించదు
ఇఫ్తార్ విందు ఒక్కటి ఇస్తే ముస్లిం మైనారిటీలకు అన్నీ చేసినట్లు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. కనీసం పేద ముస్లింలకు పండుగ వేళ రంజాన్ తోఫా కూడా ఇవ్వలేదు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలి. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముస్లింలు ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. అంతేగానీ ఏమీ చేయకుండానే అన్నీ చేసినట్లు అబద్ధాలు చెబితే ముస్లిం సమాజం హర్షించదు. తగిన సమయంలో బుద్ధి చెప్పి తీరుతుంది. – ఎంఏ క్రిస్టీ, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


