గబ్బర్‌ సింగ్‌ పారిపోయావా..! | Municipal Sanitation Workers Protest Dy CM Pawan Kalyan | Sakshi
Sakshi News home page

గబ్బర్‌ సింగ్‌ పారిపోయావా..!

May 26 2026 9:12 AM | Updated on May 26 2026 2:54 PM

Municipal Sanitation Workers Protest Dy CM Pawan Kalyan

భానుడి భగభగలు, కార్మికుల నిరసనల మధ్య ప్రయాణం ఎందుకనుకున్నారో ఏమో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తన పర్యటనను సూర్యుడు రాక ముందే ప్రారంభించి చకచకా పూర్తి చేసుకున్నారు. సోమవారం గోదావరి పుష్కర పనుల పరిశీలనలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకు పుష్కరఘాట్‌ వద్దకు చేరుకుని బోట్‌లో అధికారులతో కలిసి కోటిలింగాల రేవు వద్దకు చేరుకున్నారు.

బోట్‌లోనే అధికారులు ఆయనకు గోదావరి పుష్కర పనుల గురించి వివరించారు. పేపరుమిల్లు వల్ల జరుగుతున్న నదీ కాలుష్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనదైన స్టైల్‌లో బోట్‌లో స్టిల్స్‌ ఇచ్చి కార్యక్రమాన్ని గంటన్నరలో పూర్తి చేశారు. కోటిలింగాల రేవు వద్ద నుంచి  కొద్ది దూరంలో ఉన్న నల్లకాలువ మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం కూడా కొన్ని నిమిషాలలో ముగిసిపోవడం విశేషం. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి చేరుకున్నారు.  

మున్సిపల్‌ కార్మికుల ధర్నా 
రెల్లి జాతి ఇష్టమని చెప్పి కార్మికులను చూసి పారిపోతావా? అంటూ మున్సిపల్‌ కార్మికులు తమ నిరసనను తెలియచేశారు. కాకినాడ ఎన్నికల సభలో రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ తమను చూసి పారిపోయారని రెల్లి కార్మికులు ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుంచి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి ‘మేము ఆయనను కలవనిస్తాం. మీరు జెండాలు తీసివేయాల’ని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించారు. మూడు గంటలపాటు అక్కడే నిరీక్షించగా పవన్‌కల్యాణ్‌ బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు. కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్‌ కార్మికులు గేటు వద్ద కూర్చుని ఆందోళన చేశారు. సుమారు గంటపాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ‘గబ్బర్‌ సింగ్‌ పారిపోయావా, మా గోడు వినవా, మున్సిపల్‌ మున్సిపల్‌ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్‌ ఏఐటీయూసీ జిందాబాద్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం అదనపు కమిషనర్‌కి  వినతి పత్రం అందజేశారు.  

కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాల్లో పని చేయగలమా అని నిలదీశారు. ఆప్కాస్‌ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్‌ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరారు.  చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం రూ.9,000కు పని చేస్తున్నారని ఇప్పుడున్న ధరలతో ఆ వేతనంతో కుటుంబం జీవించగలదా అని ప్రశ్నించారు. రిక్షా కార్మికులను ఆప్కాస్‌లో కలిపి రూ.21 వేలు జీతం ఇవ్వాలన్నారు. లేకుంటే పుష్కరాల కంటే ముందుగానే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు  ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు.  

ఒక్క రోజు ముందే ఘాట్‌ల శుభ్రం
పవన్‌ కళ్యాణ్‌ రాజమహేంద్రవరం పర్యటనకు ఒక్క రోజు ముందు గోదావరి ఘాట్‌లలో ఉన్న చెత్త, చెదారాలను శుభ్రం చేశారు. ఘాట్‌ల వద్ద ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలిగించారు. నల్లా చానల్‌ వద్ద ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఘాట్‌ల వద్ద చెత్త, చెదారాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు వెయ్యకుండా మున్సిపల్‌ సిబ్బందిని కాపలాగా పెట్టారు. అయినా గోదావరి నదీ కాలుష్యాన్ని చూసిన పవన్‌ కల్యాణ్‌ ఆ«శ్చర్యపోయారు. ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా నీటిలో కలుస్తున్నాయో తెలుసుకుని నదీ జలాల్లో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.  

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement