సీఎం చంద్రబాబును కలిసిన వెంటనే మరింత దూకుడు
చిలంకూరు అ్రల్టాటెక్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఉత్పత్తిని అడ్డుకున్న ఎమ్మెల్యే ‘ఆది’ వర్గం
మైనింగ్ క్వారీ, ఐసీఎల్ కాలనీ, ప్రధాన గేట్ల వద్ద అడ్డగింత
స్థానికుల పేరిట ఫ్యాక్టరీ నిర్వహణకు ఎమ్మెల్యే వర్గం ఆటంకాలు
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైఎస్సార్ కడప జిల్లా చిలంకూరులోని అ్రల్టాటెక్ సిమెంటు పరిశ్రమపై మరింతగా రెచ్చిపోయారు. తాజాగా చంద్రబాబుతో నేరుగా భేటీ అనంతరం అ్రల్టాటెక్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ఆది ముప్పుతిప్పలకు గురి చేస్తున్నారు. బుధవారం తన అనుచరులను పంపి పరిశ్రమలోకి కార్మికులు వెళ్లకుండా అడ్డుకున్నారు. క్వారీ నిర్వహణను అడ్డగించారు. వాహనాలను కూడా అనుమతించలేదు. రాకపోకలను స్తంభింపజేశారు.
బెదిరించి దారికి తెచ్చుకుని..
చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమపై ఆధిపత్యం చలాయించేందుకు కూటమిలోని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేయని దౌర్జన్యమంటూ లేదు. ఎన్ని సమస్యలు సృష్టించినా యాజమాన్యం దిగిరాకపోవడంతో మరింత చెలరేగిపోతున్నారు. తన దుశ్చర్యలకు పచ్చ సిగ్నల్ కోసం చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ‘కమ్మ’గా సాగుతోందని, కమ్మ కులస్తులకే ప్రాధాన్యం లభిస్తోందని తిరుపతిలో బాహాటంగానే వ్యాఖ్యానించారు.
అనంతరం కూటమి సర్కార్‌లో తన పనులేమీ జరగడం లేదని, ఇలాగైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పిలిపించి మాట్లాడారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఆది కార్యాచరణకు ఉపక్రమించారు. తన అనుచరులతో అ్రల్టాటెక్ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద తిష్ట వేయించారు.దీంతో అల్ట్రాటెక్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ఆందోళనకు దిగి.. కాంట్రాక్టులు పట్టేసి!
అ్రల్టాటెక్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత లేదని.. కాలుష్య నియంత్రణ సక్రమంగా చేపట్టడం లేదని.. చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏవీ లేవంటూ ఎమ్మెల్యే ఆది తన అనుచరుల ద్వారా ఫిర్యాదు చేయించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికార యంత్రాంగం అ్రల్టాటెక్ సిమెంటు ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నట్లు గుర్తించింది. కాలుష్య నియంత్రణ చర్యలు సైతం సక్రమంగా ఉన్నట్లు రూఢీ అయ్యింది. దీంతో తిరిగి బుధవారం స్థానికులకు ప్రాధాన్యత లేదంటూ మరో నాటకం తెరపైకి తెచ్చారు.
ఇలా ఆందోళన చేసిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక కాంట్రాక్టు తనకు అనుకూలంగా ఇప్పించుకోగల్గుతున్నారు. ఇందుకోసం పరిశ్రమ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముడిఖనిజం సరఫరా చేసే టిప్పర్లపై కేసులు పెట్టించి ట్రాన్స్‌పోర్టర్లను కట్టడి చేసే యత్నం చేశారు. ఫ్యాక్టరీ తమ చెప్పు చేతుల్లో ఉండాలనే లక్ష్యంతోనే ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.


