
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇక సమ్మిట్ కోసం విశాఖకు విచ్చేసిన కిషన్ రెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖ రాజధాని అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృధ్ది చెందిన విశాఖలో.. జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీగా మాధవ్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే, పార్టీ కోసం కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేసినప్పటికీ.. రాజధానిగా విశాఖను ధృవీకరిస్తూ చేసిన కామెంట్స్ ప్రముఖంగా నిలిచాయి.
ఇక సదస్సు సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతం. ప్రతిభగల యువత ఏపీలో ఉన్నారు. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించింది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయి.
రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సమాఖ్య స్పూర్తితో ఏపీకి అన్ని విధాలా సహకారం అందిస్తాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏపీలో ఎంవోయూలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు. ఏపీ ప్రగతికి చిత్తశుద్ధితో కృషిచేస్తోన్న సీఎం జగన్‌కు అభినందనలు అంటూ ప్రశంసలు కురిపించారు.