కోవిడ్‌ సేవలకు ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులు

MBBS Final year students for Covid services - Sakshi

పీజీ/జీఎన్‌ఎం/బీఎస్‌సీ (నర్సింగ్‌) ఫైనలియర్‌ విద్యార్థుల సేవలు కూడా వినియోగించుకోండి

ఇందుకు వారికి తగిన వేతనం ఇవ్వండి

ప్రభుత్వ నియామకాల్లో కూడా ప్రాధాన్యత కల్పించండి

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచన

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులను కోవిడ్‌ వైద్య సేవల్లో వినియోగించుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌) – పీజీని వాయిదా వేసిన నేపథ్యంలో ఎంబీబీఎస్‌లను కోవిడ్‌ సేవలకు వాడుకోవాలని కోరింది. నీట్‌ను ఈ ఏడాది ఆగస్టు 31 ముందు నిర్వహించబోమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఎప్పుడు నిర్వహించేది ఒక నెల ముందే ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో నీట్‌ అభ్యర్థులను కోవిడ్‌ వైద్య సేవల్లో ఉపయోగించుకోవాలని సూచించింది.

అదేవిధంగా ఫైనల్‌ పరీక్షల కోసం వేచిచూస్తున్న జీఎన్‌ఎం/బీఎస్‌సీ (నర్సింగ్‌), పీజీ ఫైనలియర్‌ విద్యార్థుల సేవలను కూడా తీసుకోవాలని కోరింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మానవ వనరుల లభ్యతను పెంచడంలో భాగంగా ఈ సూచనలు చేస్తున్నట్లు పేర్కొంది. ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులను టెలీకన్సల్టేషన్, తేలికపాటి కోవిడ్‌ కేసుల పర్యవేక్షణ వంటి సేవలకు వినియోగించుకోవాలని సూచించింది. కనీసం 100 రోజులపాటు సేవలందించేలా వారితో ఒప్పందం చేసుకోవాలని, ఇందుకు తగిన వేతనం ఇవ్వాలంది. అలాగే భవిష్యత్‌లో వైద్య రంగంలో చేపట్టే పోస్టుల భర్తీలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది. కోవిడ్‌ సేవల్లోకి తీసుకున్న వీరంతా ఆరోగ్య నిపుణుల బీమా పథకం పరిధిలోకి వస్తారని తెలిపింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top