ఆంధ్రా అబ్బాయి సినిమా రేంజ్‌ లవ్‌స్టోరి.. 12 ఏళ్లకు ఫలించిన పెళ్లి ప్రయత్నం

Lovers Andhra Boy And Malaysian Girl Married At Visakhapatnam - Sakshi

ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. ఆస్ట్రేలియాలో ప్రేమ.. వీరిది ట్విస్టులతో కూడిన సినిమా రేంజ్‌ లవ్‌స్టోరీ. పెద్దలను ఒప్పించడానికి ఏకంగా 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. వారు ఒప్పుకున్నాకే విశాఖలోని రుషికొండలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. కాస్తా లేట్‌ అయినా కుటుంబంలో ఆనందం నెలకొంది. ఇంతకీ వీళ్ల పరిచయం ఎక్కడ.. ఎలా జరిగిందంటే.. 

వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వేడంగికి చెందిన కోట సూర్యప్రకాశరావు  15 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. కాగా, సూర్యప్రకాశరావుకు భవానీ ప్రసాద్‌ మూడో కుమారుడు. అయితే, భవానీ ప్రసాద్‌.. ఉన్నత చదువుల కోసం 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ మలేషియాకు చెందిన ఐక్‌వేతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పాలని డిసైడ్‌ అయి వారి మనసులో మాట చెప్పారు. 

అయితే, చాలా మంది ఫ్యామిలీల్లో జరిగినట్టే వీరి ప్రేమకు కూడా కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో, పెద్దల మాటలను గౌరవించి.. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని ఐక్‌వే చెప్పింది. ఈ క్రమంలో భాను ప్రసాద్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, ఇద్దరూ ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. ఉన్నత చదవుల తర్వాత.. ఇద్దరూ మంచి ఉద్యోగాలు పొందారు. కొద్దిరోజుల్లోనే భాను ప్రసాద్‌ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు.

దీంతో, ఐక్‌వే కూడా జాబ్‌ మానేసి.. భాను వ్యాపార వ్యవహారాలను చూస్తున్నారు. ఇలా ఏకంగా 12 సంవత్సరాల కాలం గడిపోయింది. ఇంట్లో వాళ్లు ఇద్దరికీ సంబంధాలు చూసినప్పటికీ నో చెబుతూ వచ్చారు. ఇలా ఇద్దరికీ 41 ఏళ్ల వయస్సు వచ్చింది. ఈ క్రమంలో ఐక్‌వే కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమకు ఓకే చెప్పి.. పెళ్లికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య విశాఖలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top