సీనియర్లకు మొండిచేయి.. జూనియర్లకే అందలం | Lokesh Neglects the Education Department in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సీనియర్లకు మొండిచేయి.. జూనియర్లకే అందలం

May 10 2026 5:59 AM | Updated on May 10 2026 5:59 AM

Lokesh Neglects the Education Department in Andhra Pradesh

పాఠశాల విద్యాశాఖలో వింత వైఖరి

రాష్ట్రంలో 3 జిల్లాలకే రెగ్యులర్‌ డీఈవోలు 

23 జిల్లాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్లకే డీఈవో బాధ్యతలు  

సొంత శాఖను మంత్రి లోకేశ్‌ పట్టించుకోవడం లేదనే విమర్శలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖలో పాలన గాడి తప్పింది. చట్టాలు చిత్తు కాగితాల్లా మారాయి. అర్హతలున్న సీనియర్లను పక్కనబెట్టి అత్యంత జూనియర్లను ఉన్నత స్థాయి పోస్టుల్లో నియమించడం చంద్రబాబు ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పేరున్న నారా లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో సర్వసాధారణమైంది. సర్వీస్‌ రూల్స్‌ను పట్టించుకోకుండా గతేడాది డిసెంబర్‌లో అనర్హులకు పదోన్నతులు కల్పించి డీఈవోలుగా నియమించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు జిల్లాలకు తప్ప.. మిగిలిన 23 జిల్లాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, (ఏడీ), ఈ కేడర్‌లో జూనియర్లు డీఈవోలుగా చలామణి అవుతున్నారు.

కనీస అర్హత బీఈడీ లేనివారు సైతం డీఈవో బాధ్యతల్లో ఉన్నారు. ఈ అంశంపై రాష్ట్రాధికారులకు, మంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. ఈ నెల 5వ తేదీలోగా అన్ని శాఖల్లో పదోన్నతులు పూర్తి చేయాలని జీఏడీ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటి వరకు విద్యాశాఖలో చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.  

సీనియారిటీకి, అర్హతలకు తిలోదకాలు  
సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం రెగ్యులర్‌ పోస్టుకు ఏ అర్హతలు ఉండాలో పూర్తి అదనపు బాధ్యతలు ఇవ్వాలన్నా అవే అర్హతలు ఉండాలి. కానీ ఈ ప్రభుత్వంలో నిబంధనలకు తిలోదకాలిచ్చి కరెన్సీకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం 13 జిల్లాల డీఈవోలను బదిలీలు చేసింది. అంతకు ముందు మరికొందరిని సర్దుబాటు పేరుతో జిల్లాలకు నియిమించింది. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా సీనియారిటీని పట్టించుకోలేదు. డీఈవోల నియామకంలో తొలుత డిప్యూటీ డైరెక్టర్లకు అవకాశం కల్పించాలి. కానీ వారిని ప్రాధాన్యం లేని శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక గతేడాది పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌ సుమారు 100 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్ల సీనియారిటీ లిస్టును విడుదల చేసింది.

ఇందులో అత్యంత జూనియర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లను 23 జిల్లాలకు డీఈవోలుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, 78 డీవైఈవో పోస్టుల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్లను నియమించాల్సి ఉన్నా, పూర్తిగా టీచర్లను అదనపు బాధ్యతల్లో నియమించారు. ఈ పోస్టుల్లో ఖచ్చితంగా బీఈడీ అర్హత ఉండాలి, కానీ ఫిజికల్‌ డైరెక్టర్లను డీవైఈవో పోస్టుల్లో నియమించడం ఈ ప్రభుత్వంలోనే చెల్లింది. సమగ్ర శిక్షలో కీలకమైన అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ల పోస్టుల్లో విద్యాశాఖ అధికారులనే నియమించాలి. కానీ రెవెన్యూ శాఖలోని ఆర్డీవోలు, లెక్చరర్లను నియమించారు.

సాధారణంగా డైట్‌లో పనిచేసే లెక్చరర్‌కు ఎంఈడీ అర్హతతోపాటు 55 శాతం మార్కులు తప్పనిసరి. అలాగే డైట్‌లో ప్రిన్సిపాల్‌గా నియమించాలంటే ఎంఈడీ, 55 శాతం మార్కులతోపాటు టీచింగ్‌ అనుభవం తప్పనిసరి. ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి ఎంఈడీ అర్హత లేనివారిని డైట్‌ ప్రిన్సిపాళ్లుగా నియమించారు. రెండు మూడురోజుల్లో డీఈవో బదిలీలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇందులోనూ పాత విధానమే అనుసరించినట్టు చర్చ జరుగుతోంది. ఇంత జరుగుతున్నా మంత్రి లోకేశ్‌ కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ఈ వ్యవహారమంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యాశాఖను పట్టించుకోని మంత్రి లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక్క పాఠశాల విద్యాశాఖలోనే సుమారు 1.85 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కమిషనరేట్‌లో అడ్మిని్రస్టేషన్‌ విభాగం డైరెక్టర్, అదనపు డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, వారి కింద జూనియర్‌ సహాయకులు, సమగ్ర శిక్ష, డీఈవో కార్యాలయాలు, ఆర్జేడీ, ఎస్సీఈఆర్టీ, బాల భవన్, వయోజన విద్య, ఐటీ, మోడల్‌ స్కూల్స్, ఎస్సెస్సీ బోర్డు, ఓపెన్‌ స్కూల్‌ తదితర కార్యాలయాల్లో మరో 7 వేల మంది అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఇవిగాక ఇంటర్‌ విద్య, ఉన్నత విద్య అంతా కలిసి 2.50 లక్షల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. కానీ, రెండేళ్లలో మంత్రి లోకేశ్‌ కలిసింది కేవలం ఆయా శాఖల్లోని కమిషనర్లను మాత్రమే. దీంతో ఉన్నతాధికారులు చేసిందే సర్వీసుగా, వారు నియమించిన వారే అధికారిగా తయారైంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement