రామభద్రపురం.. వేలాది కుటుంబాలకు వరం 

largest inter-state vegetable market in Uttarandhra - Sakshi

ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద అంతర్‌ రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ 

కూరగాయలు, పండ్ల విక్రయ కేంద్రంగా రామభద్రపురం 

భారీగా సాగు చేస్తున్న మార్కెట్‌ పరిసర ప్రాంత రైతులు 

ఉత్తరాంధ్ర సహా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్రకు ఎగుమతి 

రోజూ రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వ్యాపార కార్యకలాపాలు 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర కేంద్రంగా అంతర్‌ రాష్ట్ర అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా విరాజిల్లుతోంది రామభద్రపురం వెజిటబుల్‌ మార్కెట్‌. విజయనగరం జిల్లా రామభద్రపురంలో గల ఈ మార్కెట్‌ వేలాది మంది చిరు వ్యాపారులను అమ్మలా ఆదుకుంటోంది. ఈ ప్రాంతంలో పండించిన కూరగాయలు, పండ్లను నిత్యం వీరభద్రపురం మార్కెట్‌ నుంచి ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. కూరగాయలు పండించే కూరాకుల కులస్తులు దాదాపు 600 కుటుంబాల వరకు ఇక్కడ ఉండటంతో ఈ మార్కెట్‌కు ప్రాచుర్యం వచ్చింది. రామభద్రపురంతో పాటు, ఆరికతోట, కొత్తరేగ, బాడంగి మండలం ముగడ, కోడూరు తదితర ప్రాంతాల్లో కూరాకుల కులస్తులు ఉన్నారు. ప్రతి కుటుంబం 25 సెంట్ల విస్తీర్ణంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తూ జీవనోపాధి పొందుతోంది. వీరితో పాటు రామభద్రపురం, బాడంగి, దత్తిరాజేరు, గజపతి నగరం, మెంటాడ, సాలూరు, బొబ్బిలి మండలాల నుంచి రోజూ 3 వేల మంది వరకు రైతులు కూరగాయలు, పండ్లను ఈ మార్కెట్‌కు తెస్తుంటారు. 

పండ్లకూ కొదవ లేదు 
ఇక్కడ మామిడి, బొప్పాయి, జామ, పనస, అనాస, బత్తాయి, సపోటా, దానిమ్మ, ద్రాక్ష, అరటి తదితర పండ్లు కూడా లభ్యమవుతాయి. వీటిని దాదాపు 150 మంది వరకూ విక్రయిస్తుంటారు. స్థానికంగా పండేవే కాకుండా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి అరటి గెలలు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి టమాటా రామభద్రపురం వస్తుంటాయి. అనాస, పనస పండ్లు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సీతంపేట నుంచి తీసుకువచ్చి ఈ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా కేంద్రాల్లోని అన్ని హోటళ్లకు ఇక్కడి నుంచే కాయగూరలు రోజూ ప్రత్యేక వ్యాన్లలో వెళ్తుంటాయి. ఈ మార్కెట్‌ వల్ల ఏటా సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు గ్రామ పంచాయతీకి ఆశీళ్ల ఆదాయం వస్తోంది.

విపత్తు వేళా ఠీవీగా.. 
కరోనా ప్రభావంతో అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ రామభద్రపురం అంతర్‌ రాష్ట్ర కూరగాయల మార్కెట్‌ తట్టుకుని నిలబడగలిగింది. కూరగాయ రైతులు యథావిధిగా సాగును కొనసాగించడం ఇందుకు ఎంతో దోహదపడింది. రైతు భరోసా పథకం ద్వారా కూరగాయ రైతులకు సైతం ఏటా రూ.13,500 సాయం అందించడంతో మరింత ఉత్సాహంతో పంటల సాగు చేపడుతున్నామని రైతులు చెబుతున్నారు. 

ఈ మార్కెట్టే ఆధారం 
మా తాతల కాలం నుంచి కూరగాయల సాగే మా వృత్తి. అప్పటి నుంచి ఈ మార్కెట్‌కే కూరగాయలను తెస్తున్నాం. ఈ ఏడాది రెండెకరాల్లో కూరగాయలు వేశాను. దిగుబడి బాగా వచ్చింది. వాటిని రామభద్రపురం మార్కెట్‌లోనే విక్రయిస్తున్నా. 
– కర్రి అప్పారావు, మెట్టవలస, బొబ్బిలి మండలం 
 
ఎందరో కార్మికులకు ఉపాధి 
రామభద్రపురం కూరగాయల మార్కెట్‌ మా లాంటి ఎందరో కార్మికులకు ఉపాధినిస్తోంది. నేను పదేళ్ల నుంచి కళాసీగా పనిచేస్తున్నాను. రోజూ రూ.300 నుంచి రూ.400 వరకు కూలీ రావడంతో జీవితం సాఫీగా వెళ్తోంది. 
– ఎరుసు రామకృష్ణ, కళాసీ, రామభద్రపురం 

 40 ఏళ్లుగా వ్యాపారం 
ఈ మార్కెట్‌లో సుమారు 40 ఏళ్ల నుంచి కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడ పండిన కాయగూరలు, పండ్లను ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తాను. అక్కడ పండే టమాటా, మునగకాడలు, దుంపలు, క్యారెట్, బీట్‌రూట్‌ను ఇక్కడికి తెస్తుంటాను. 
– మామిడి చిన్న, వ్యాపారి, రామభద్రపురం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top