విధులకు డుమ్మా కొడుతున్న డాక్టరమ్మ
గిద్దలూరులో సొంత క్లినిక్‌లో ప్రాక్టీసు
ఎఫ్‌ఆర్‌ఎస్ ట్యాంపరింగ్ చేసినట్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు
డ్యూటీకి హాజరు కాకుండానే ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన క్రిష్ణంశెట్టిపల్లి గ్రామస్తుడు
ఒంగోలు టౌన్: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన గాడితప్పింది. ప్రభుత్వ ఉద్యోగులది ఇష్టారాజ్యమైంది. గిద్దలూరు మండలం క్రిష్ణంశెట్టిపల్లి ప్రాథమిక వైద్యశాలకు చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస తరుచూ విధులకు డుమ్మా కొట్టి సొంత ప్రాక్టీసు చేసుకుంటున్నారని గ్రామస్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు క్రిష్ణంశెట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రజలు కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందనలో ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
డాక్టరమ్మ తరుచూ విధులకు డుమ్మా
క్రిష్ణంశెట్టిపల్లి ప్రాథమి వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస కొంతకాలంగా విధులకు హాజరు కావడం లేదు. ఆమె తన భర్తతో కలిసి గిద్దలూరు పట్టణంలో సొంతంగా హాస్పటల్ నిర్వహిస్తున్నారు. దీంతో ఆమె తరుచూ విధులకు హాజరు కాకుండా సొంత హాస్పిటల్లో బిజీగా గడుపుతున్నారు. నిబంధనల ప్రకారం పీహెచ్‌సీలో విధులు నిర్వహించే మెడికల్ ఆఫీసర్‌తో పాటు నర్సింగ్ సిబ్బంది రోజూ ఫేస్ రికగ్నైజ్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్)లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనను భేఖాతర్ చేస్తున్న డాక్టర్ మానస ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. సొంత క్లినిక్ నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు వేసుకుంటున్నారు.
విధులకు హాజరు కాకుండానే రిజిస్టర్‌లో అటెండెన్స్ వేసుకుంటూ ప్రభుత్వం నుంచి జీతభత్యాలు నెలనెలా తీసుకుంటున్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానసను స్ఫూర్తిగా తీసుకున్న కొందరు నర్సింగ్ సిబ్బంది కూడా విధులకు డుమ్మా కొడుతున్నారు. అయినా వారికి పూర్తిస్థాయి జీతభత్యాలు వేస్తున్నారు. డాక్టర్, నర్సులు విధులకు రాకపోవడంతో ఆస్పత్రికి వచ్చే మిగిలిన సిబ్బంది ఏంమి చేయాలో పాలుపోక కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకోవడం, టైంపాస్ కావడానికి బల్లల మీద నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. దీంతో క్రిష్ణంశెట్టిపల్లిలో పేరుకు పీహెచ్‌సీ ఉన్నప్పటికీ వైద్యసేవలు అందక పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భారీగా వర్షాలు కురవడంతో పాటు చలికాలం ప్రారంభం కావడంతో గ్రామాల్లో జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. ప్రజలు వైద్యం కోసం పట్టణానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు
ఈ విషయం గురించి ఈ ఏడాది జూన్ 23వ తేదీన గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. 24వ తేదీన జిల్లా వైద్యాధికారిని కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలతో సహా డీఎంహెచ్‌ఓకు వివరించారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో జూలై 28వ తేదీన మరొకసారి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో జూలై 30వ తేదీన క్రిష్ణంశెట్టిపల్లి పీహెచ్‌సీకి వెళ్లిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమరి్పంచినట్లు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా అధికారులకు ముడుపులు ముట్టినందువల్లే డాక్టర్ మానసపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
డాక్టర్ మానసపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ పూర్తి చేశాం. డైరక్టర్ ఆఫ్ హెల్త్‌కు నివేదిక సమరి్పంచాం. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ


