ఖరీఫ్‌కు కృష్ణా జలాలు

Krishna waters to Kharif crops - Sakshi

రెండు రాష్ట్రాలు ఈనెల 15 వరకు నీటిని వాడుకోవచ్చు

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ పంటల కోసం ఈనెల 15 వరకు కృష్ణా నది నీటిని వాడుకోవడానికి ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు అనుమతినిచ్చింది. రబీకి అవసరమైన నీటిపై నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. నెలాఖరులోగా త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమై.. వినియోగించుకున్న జలాలను పరిగణనలోకి తీసుకుని, రబీకి కేటాయింపులు చేస్తుందని పేర్కొంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు కృష్ణా జలాల వినియోగం.. సాగు, తాగు నీటి అవసరాలపై చర్చించేందుకు బోర్డు త్రిసభ్య కమిటీ గురువారం సమావేశమైంది. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్‌ పాల్గొన్నారు.

జూన్‌ 1 నుంచి నవంబర్‌ 30 వరకూ 350.585 టీఎంసీలు వాడుకున్నట్లు ఏపీ ఈఎన్‌సీ చెప్పారు. తెలంగాణ 108.235 టీఎంసీలు వాడుకుందని తెలిపారు. ఖరీఫ్‌ కోసం ఈనెల 15వరకు సాగర్‌ కుడి కాలువకు 11.77 టీఎంసీలు, ఎడమ కాలువకు 2.55, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు 5.22, హంద్రీ–నీవాకు 4.14 మొత్తం 23.68 టీఎంసీలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల, మధ్యతరహా ప్రాజెక్టుల కనీస నీటి మట్టాలకు లభ్యతగా ఉన్న జలాలు, తుంగభద్ర డ్యామ్‌లో రెండు రాష్ట్రాల వాటా నీటిని కలుపుకుంటే 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.

ఇందులో ఏపీ వాటా 171.163, తెలంగాణ వాటా 160.545 టీఎంసీలని వివరించారు. దీనిపై తెలంగాణ ఈఎన్‌సీ స్పందిస్తూ.. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను ఖరీఫ్‌ పూర్తయిన తర్వాత తేలుద్దామన్నారు. ఈనెల 15 వరకు  రెండు రాష్ట్రాలు అవసరమైన మేరకు నీటిని వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి రాయ్‌పురే సమ్మతించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top