తాగునీటి అవసరాలపై చర్చ
సాక్షి, అమరావతి: జూలై వరకు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం కానుంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు పాల్గొననున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాల కోసం మే 31 వరకు 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏప్రిల్ 29న ఏపీ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.
తాగునీటి అవసరాల కోసం శ్రీశైలంలో 5 టీఎంసీలు, సాగర్‌లో 13 టీఎంసీలు కేటాయించాలని మే 2న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చించి... శ్రీశైలం, సాగర్‌లో నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయడంపై కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ ప్రతిపాదన చేయనుంది. దీని ఆధారంగా కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేయనుంది. కాగా, కృష్ణా బోర్డు 21వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 14న హైదరాబాద్‌లో జరగనుంది.


