అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. ఏళ్లు గడిచినా.. టీడీపీ-ఈనాడు తీరు మారలేదంతే!

Kommineni Comment On TDP indiscipline Behavior At Assembly - Sakshi

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇద్దరు.. ముగ్గురు  తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య  జరిగిన తోపులాటను ఎవరికి వారు తమకు అనుకూలమైన పద్దతిలో ప్రచారం చేసుకుంటారు. రాజకీయ పార్టీలు అలా చేశాయంటే ఓ అర్థం ఉంటుందేమో. కానీ, ఒక వర్గం మీడియా కూడా అదే తరహాలో ఏకపక్షంగా వార్తలు రాస్తోంది. ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. 

శాసనసభ మొదలైనప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏదో ఒక సాకు చూపి అల్లరి చేయడం, సస్పెండ్ అవడం, బయటకు వెళ్లి హీరో పనిచేసినట్లు, ప్రభుత్వమే తప్పు చేసిందన్నట్లుగా ప్రచారం చేయడం అలవాటుగా మారింది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడే.. మధ్యలోనే  నినాదాలు చేసుకుంటూ వీరు బయటకు వెళ్లిపోయారు. ఉన్నంత సేపు రన్నింగ్ కామెంటరీతో డిస్టర్బ్ చేయడానికి యత్నించారు. ఆ తర్వాత నుంచి కూడా అదే  విధానం అవలంభిస్తున్నారు. రోజూ ఏదో రకంగా గొడవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. 

వాళ్లు శాసనసభ పోడియంలోకి వెళ్లి స్పీకర్ తమ్మినేని సీతారాంను రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడం, కాగితాలు చించి ఆయనపైనే పోయడం,ప్లకార్డులను ఆయన ముఖం మీద పెట్టడం,  టేబుల్ మీద ఉన్న వస్తువులను లాగడం వంటివాటితో పాటు  స్పీకర్ చైర్ కు అటూ ఇటూ చేరి మోకాలితో పొడవం  వంటివి కూడా చేస్తున్నారట. ప్రతిపక్షంలో అంతా కలిపి 20 మంది లేరు. వారిలో సగం మంది సభలో ఉండరు. మిగిలిన పది, పన్నెండు మంది అల్లరి చేయడానికే వచ్చినట్లు హడావుడి చేసి వెళ్లిపోవడం నిత్యకృత్యంగా మారిందన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా కూడా దానిని అడ్డుకునే యత్నం చేశారు.

గతంలో.. శాసనసభలో సమర్ధంగా తమ వాదన వినిపించి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి యత్నించేవారు. అయితే ఇటీవలికాలంలో సభలో అల్లరి చేయడం ద్వారానే ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం దురదృష్టకరం. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ఎంత మంచిదన్న సంగతిని.. అంతా ఆలోచించాలి. ఇలాంటి ఘటనలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది తేల్చడం అంత తేలికకాదు. కానీ, అసలు మూలం ఏమిటి? గొడవకు ముందు ఎవరెవరు ఎలా వ్యవహరించారు? అనే దానిని పరిశీలించవచ్చు.

రోడ్లపై బహిరంగ సభలు పెట్టవద్దన్న జివో నెంబర్ 01ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దానిని ప్రశ్నోత్తరాల తర్వాత చూస్తానని స్పీకర్ చెప్పారు. అయినా వినకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. వెళ్లినవారు నిరసన చెప్పడానికి అన్నట్లు వ్యవహరించలేదు. అధికార పక్షాన్ని రెచ్చగొట్టేలా, గౌరవ స్పీకర్ను అవమానించేలా చేష్టలకు దిగారు. దాదాపు రోజూ ఇలాగే చేస్తున్నారు. అయినా స్పీకర్ ఏ రోజుకారోజు సస్పెండ్ చేస్తూ.. టీడీపీ సభ్యుల్ని బయటకు పంపుతున్నారు. బహుశా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా సభ జరపడం బాగోదని ఆయన అనుకుంటున్నారు కాబోలు. ఇదిలా ఉంటే.. 

తెలంగాణ శాసనసభలో 2018లో గవర్నర్ ప్రసంగం సమయంలో పోడియం వైపు మైక్రోఫోన్‌లు విసిరారన్న అభియోగంపై ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లను శాసనసభ నుంచి బహిష్కరించారు. అదే సందర్భంలో మరో పదకొండు మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ అంతటికి సస్పెండ్ చేశారు. అలాగే మరోసారి.. ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు నిరసన తెలిపేందుకు యత్నించగా..  వారిని సెషన్ అంతటికి సస్పెండ్  చేశారు. ఈ ప్రభావం వల్లనో ఏమో..  అప్పటి నుంచి తెలంగాణ శాసనసభలో అంతస్థాయిలో సన్నివేశాలు చోటు చేసుకోవడం లేదనే చెప్పాలి.  

మహారాష్ట్రలో స్పీకర్‌ను అడ్డుకున్న కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. సభ నుంచి పంపించి వేసిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిసార్లు.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో అప్పుడప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడిన దాఖలాలూ ఉన్నాయి.  అంతెందుకు.. కొన్నిసార్లు ముష్టిఘాతాలకు కూడా పాల్పడ్డారు కూడా.  అసెంబ్లీలే కాదు.. కొన్ని దేశాల్లో పార్లమెంట్‌లలోనూ ఇలాంటి ఘర్షణలు జరిగాయి.  మన దేశానికొస్తే..  పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల విభజన బిల్లు  సమయంలోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. అప్పుడు ఈ టీడీపీ ఎంపీలే ఒకరినొకరు కొట్టుకున్నారన్న వార్తలు  బయటకు వచ్చాయి. అంతకుముందు ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు కూడా.  అయితే.. వీటి ప్రభావం ఎన్నికలలో ఎంతవరకు ఉంటుందనేది అనుమానమే.  అయితే.. ప్రజలు ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటారని అనుకుంటేనే..  ప్రజాప్రతినిధులు కొంత క్రమశిక్షణతో ఉంటారు.

కేసిఆర్ ప్రభుత్వం ఇలాంటి వాటిపై సీరియస్‌గా ఉండడంతో శాసనసభలో పెద్ద అలజడి లేకుండానే సాగిపోతోందని చెప్పాలి. అయితే ఇదే బీఆర్‌ఎస్‌(ఒకప్పుడు టీఆర్‌ఎస్‌) ఎమ్మెల్యేలు తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీని నడవనివ్వకుండా అడ్డుకున్న ఘటనలు, సస్పెండ్ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో..  గవర్నర్ నరసింహన్ ప్రసంగం చేస్తుండగా, టీడీపీ సభ్యులుగా ఉ‍న్న రేవంత్ రెడ్డి, నాగం జనార్ధనరెడ్డిలు పోడియంపై ఉన్న కుర్చీని లాగేయడం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు పేపర్లు విసిరడం వంటివి చేయడంతో వారిని సభనుంచి సస్పెండ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉండవచ్చు.

ఇక విభజన తర్వాత అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న రోజా..   విజయవాడ కాల్ సెక్స్ మనీ రాకెట్ పై మాట్లాడడానికి సిద్దమవుతున్న తరుణంలో ఆమెపై ఏదో నెపం పెట్టి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. అప్పట్లో ఆ అంశం పెద్ద వివాదం అయింది. ఆమె కోర్టుకు వెళ్లి తీర్పు తెచ్చుకున్నా..  చంద్రబాబు ప్రభుత్వం, ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు  ఆమెను సభలోకి అనుమతించలేదు. తాను అధికారంలో ఉన్నప్పుడు సభా సంప్రదాయాలు, విలువలు అంటూ చంద్రబాబు ఎన్నో సుద్దులు చెబుతుంటారు. అప్పుడు ఆయనకు అసెంబ్లీ అన్నది పవిత్రంగా కనిపిస్తుంది. కానీ, అదే టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే అసెంబ్లీని రణరంగంగా మార్చుతుంటారు.

గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన సీటులో నుంచి కాగితాలు విసరడాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తదుపరి ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులు పోడియం వైపు వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ అంటూ రూలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే ఈ విలువలను, సంప్రదాయాలను మంట గలిపి పోడియంలోకి వెళ్లడం నిత్యకృత్యంగా మార్చుకుంది. శాసనసభలో నిరసన చెప్పడం తప్పు కాదు. కానీ దానికంటూ  ఓ రీతి, కొన్ని పరిమితులు ఉంటాయి. పైగా స్పీకర్ చుట్టూ చేరి అల్లరి చేయడం హేయం.  ఆ టైమ్‌లోనే ఆయనకు రక్షణగా ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళితే గొడవ జరిగింది.

చంద్రబాబు శైలి ఏమిటంటే , ఇలాంటి అల్లర్లకు దళిత ఎమ్మెల్యేని ముందు పెడుతుంటారు. తద్వారా ఆయన జోలికి ఎవరైనా వెళితే ఇంకేముంది?..  దళిత ఎమ్మెల్యేని అలా చేశారు..ఇలా చేశారు అంటూ ప్రచారం చేయడం మొదలుపెడతారు. 

నిజానికి.. ఏపీ సభలో జీవో నెంబర్ 1 గురించి ఆందోళనకు దిగడమే తప్పు!. ఆ జీవోని టీడీపీ వ్యతిరేకించింది. దానిపై హైకోర్టుకు వెళ్లగా, తొలుత వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఎగిరి గంతేశారు. కానీ తదుపరి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఈ జీవోను యథాతధంగా కొనసాగించమని తీర్పు వచ్చింది. అయినా ప్రతిపక్ష టీడీపీ కాని, మరికొన్ని పార్టీలు కాని దీనిపై ఆందోళనకు దిగాలని తలపెట్టాయి. ఆ క్రమంలో శాసనసభలో టీడీపీ అల్లరి చేసింది. అదే కనుక వైఎస్సార్‌సీపీ ఇలా చేసి ఉంటే..?.

చంద్రబాబు నాయుడు ‘‘న్యాయస్థానాలంటే వీళ్లకు(వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి..) లెక్కలేదు అంటూ విమర్శించేవాడు. ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి. గతంలో ప్రతిపక్షంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఏమైనా నిరసనలు చెప్పినప్పుడు.. అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వెలిబుచ్చేవారు. దానిని ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించి స్పీకర్ వ్యాఖ్యలు వేదవ్యాక్యం అన్నట్లు ప్రచారం చేసేది. అదే స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని.. ఇప్పుడు ఎన్నిసార్లు ప్రతిపక్ష టీడీపీ  అల్లర్లు,గొడవలపై తన ఆగ్రహం వెలిబుచ్చినా.. టీడీపీ ఎమ్మెల్యేలను తీవ్రంగా మందలించినా.. దాదాపు అసలు వార్తగానే రాయరు. ఇదంతా టీడీపీపై ప్రేమా? లేక ఆనాటి స్పీకర్ కోడెలపై  ఉన్న ప్రత్యేక అభిమానమా?..  అంటే ఏమి చెబుదాం.

ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఇకనైనా అల్లరికి దిగే సభ్యులపై కఠినంగా ఉంటారా?. అన్నిసార్లు కాకపోయినా, మరీ హద్దుదాటి అరాచకంగా వ్యవహరించినవారిపైన అయినా తీవ్ర చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటివి పునరావృతం కావేమో!.


::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top