విజయవాడలో బీసీ డిక్లరేషన్ ఫారాన్ని చూపుతున్న బీసీ సంఘాల నేతలు
బీసీ మేధోమథన సదస్సులో వక్తల నిలదీత
హామీల అమలుకు ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రకటన
సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను చంద్రబాబు వెంటనే అమలు చేయాలని బీసీ మేధోమథన సదస్సు డిమాండ్ చేసింది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అధ్యక్షతన విజయవాడలో ఆదివారం ‘బీసీల మేధోమథనం’ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా తమ డిమాండ్లను తీర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఆమోదించిన తీర్మానాలను ‘విజయవాడ బీసీ డిక్లరేషన్’ పేరుతో బీసీ సంఘం నేతలు ప్రకటించారు.
జనగణనతోపాటు సమగ్ర కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీలకు చట్టసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ మస్తానమ్మ కోరారు. బీసీ రక్షణ చట్టం తెస్తామన్న హామీని రెండేళ్లు గడిచినా చంద్రబాబు అమలు చేయలేదని, తక్షణం చట్టం తేవాలని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడా సీతా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, బీసీ సంఘం నేతలు కన్నా మాస్టారు, బ్రహ్మానంద శర్మ, లంకా వెంకటేశ్వరరావు, అన్నవరపు నాగేశ్వరరావు, పారేపల్లి మహేష్, మూర్తి తదితరులు మాట్లాడారు.
బలవంతులమని నిరూపిద్దాం
బీసీలను బలహీనవర్గాలు అని పిలిచే వారిని ఉపేక్షించవద్దు. మనం బలహీనులం కాదు.బలవంతులమని నిరూపిద్దాం. ఇచి్చన హామీలను అమలు చేయాలని యాచించే స్థాయిలో మనం ఉండకూడదు. మనం శాసించే స్థాయికి ఎదగాలి. బీసీలందరూ సంఘటితమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మన కాళ్ల దగ్గరకే వస్తారు. పల్లె పల్లెకు బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తాం. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ బీసీల అడ్డాగా మారుతుంది. – జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
హామీల అమలుకు పోరాటం చేద్దాం
ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పోరాటం చేద్దాం. బీసీ హక్కులు కాపాడుకునేందుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం. – కేసన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఐక్యంగా ఉద్యమిద్దాం
ఎన్నికల ముందు బీసీల ఓట్లు కోసం వారికి ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు..తీరా అధికారం చేపట్టి రెండేళ్లయినా వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు మనం జనాభాల్లో అత్యధికంగా ఉన్నప్పటికీ పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తెద్దాం. ఆ మేరకు బీసీ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ఉద్యమిద్దాం. – బీసీ రమేష్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


