సాక్షి, శ్రీకాకుళం జిల్లా: పలాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు.

ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులను బయటకు పంపించివేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలాస ఆసుపత్రి వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు బైఠాయించారు.

కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘‘25 వేల మందికి పైగా భక్తులు వస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. దేవాలయం ప్రైవేటా? ప్రభుత్వానిదా అన్నది ప్రశ్నకాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధానం’’ అని ధర్మాన పేర్కొన్నారు.


