ప్రభుత్వ వేధింపులకు పది రోజుల్లోనే నలుగురు ఉద్యోగులు బలి
అలవికాని లక్ష్యాలతో మానసిక క్షోభకు గురిచేస్తున్న సీఎం చంద్రబాబు
ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష ఏర్పాటు చేయాలి
ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గౌరవంగా వ్యవహరించాలి
సర్కారు వైఖరిని మార్చుకోకపోతే ఉద్యోగుల తరఫున పోరాటం ఉధృతం
ఉద్యోగులూ అధైర్యపడకుండా ఓపికతో ఉండండి.. మళ్లీ మంచి రోజులొస్తాయి
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు మరణ శాసనం రాస్తోందని, ఒత్తిడికి గురిచేసి వారి మరణాలకు కారణమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువైపోయాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫరెన్స్‌లు, అసాధ్యమైన సర్వే టార్గెట్ల పేరుతో ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విమర్శించారు.
గత పది రోజుల్లోనే పని ఒత్తిడితో నలుగురు ఉద్యోగులు గుండెపోటుతో మరణించడం ప్రభుత్వ వేధింపులకు నిదర్శనమని మండిపడ్డారు. పది రోజుల్లో ఒక తహసీల్దార్, ఒక ఎస్‌ఈ, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని, వీరంతా 30 నుంచి 40 ఏళ్లలోపు వారే కావడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వలంటీర్లను తొలగించేసి వారు చేయాల్సిన పనిని సచివాలయ ఉద్యోగులకు అప్పగించి వారిపై ఒత్తిడి పెంచిందని దుయ్యబట్టారు.
సచివాలయ ఉద్యోగులను పగలూ రాత్రీ, సెలవు రోజులు అని తేడా లేకుండా ఇంటింటికీ తిరిగి సర్వేలు చేయాలని అమానవీయమైన ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రాత్రిపూట సర్వే చేయాలని ఇచ్చిన ఆర్డర్లను ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి ఉదహరించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గౌరవంగా నడుచుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యోగుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులూ అధైర్యపడకుండా ఓపికతో ఉండాలని, మంచి రోజులు మళ్లీ వస్తాయని కాకర్ల వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.
పట్టాభిపై హత్య కేసు నమోదు చేయాలి
‘గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి.., జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరావుపై రెచి్చపోయి, గదమాయిస్తూ తీవ్రంగా అందరి ముందు అవమానించారు.
డంపింగ్ యార్డ్‌లో చెత్త నిల్వల తరలింపునకు పాత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు ఎస్‌ఈ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా.. ఏం తమాషా చేస్తున్నావా అంటూ పట్టాభి మండిపడ్డారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన గోవిందరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అందుకే ఎస్‌ఈ మృతికి ముమ్మాటికీ పట్టాభిదే బాధ్యత. ఒక ఉన్నతాధికారికే రక్షణ లేకపోతే, ఇక చిన్న ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉంటుందో అందరూ ఆలోచించాలి.
ఇటీవల ఒక తహసీల్దార్ మృతి, పలువురు సచివాలయాల ఉద్యోగులు ఆత్మహత్యలకు అధికార పార్టీ వేధింపులే కారణం. ఒక ఎస్‌ఈ ప్రాణాలు బలిగొన్న పట్టాభిపై వెంటనే హత్య కేసు నమోదు చేయడమే కాకుండా, ఆయన్ను కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. లేకుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తాం’ అని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు.


