
సాక్షి,అమరావతి: మాజీ మంత్రి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు సోమవారం(ఆగస్టు 18)న తీర్పును వెలవరించింది. మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ రావడంతో 85రోజులుగా జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్‌చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్‌లు జత చేశారు.
ఇలా కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు బనాయించడంతో వాటిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
