
నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, ఎర్రబల్లె పోలింగ్ బూత్‌ల మార్పు
గతంలో ఏ గ్రామం వారు ఆ గ్రామంలోనే ఓటు వేసేవారు
ఇప్పుడు బూత్‌లను మార్చిన ఎన్నికల కమిషన్
ఈ కారణంగా దాదాపు 4కి.మీ ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది
ఆరు పోలింగ్ బూత్‌లలో 36శాతం ఓటింగ్‌కు సమస్య
పోలింగ్ శాతం తగ్గించేందుకు టీడీపీ కుట్ర
టీడీపీ ప్రభావం నుంచి ఎన్నికల సంఘం బయటకు రావాలి
మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ పోలింగ్ బూత్‌లను మార్చడం దారుణమన్నారు. ఎర్రబల్లె గ్రామానికి చెందిన పోలింగ్ బూత్‌ను నల్లపురెడ్డిపల్లె గ్రామానికి, నల్లపురెడ్డిపల్లె పోలింగ్ బూత్‌ను ఎర్రబల్లెకు, నల్లగొండువారిపల్లెకు చెందిన పోలింగ్ బూత్‌ను నల్లపురెడ్డిపల్లెకు మార్చారన్నారు.
ఈ విధంగా చేయడంవల్ల ఎర్రబల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాలి, నల్లపురెడ్డిపల్లె ప్రజలు ఎర్రబల్లెకు వెళ్లి ఓటు వేయాలని, అలాగే నల్లగొండువారిపల్లె ప్రజలు నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సి వస్తుందన్నారు. నల్లగొండువారిపల్లెలో దాదాపు 632 ఓట్లు ఉన్నాయని, వీరందరూ 4 కి.మీ. దూరంలోని నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్లపురెడ్డిపల్లె ప్రజలందరూ నల్లగొండువారిపల్లెకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని, ఇలా ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు.
అదే 2021లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ గ్రామంలోని ఓట్లు ఆ గ్రామంలోనే వేసేలా బూత్‌లు ఏర్పాటు చేయడంతో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. కానీ ఇప్పుడు పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉందన్నారు. నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం ఏ స్థాయిలో జరిగిందో, కార్లను ఎలా ధ్వంసం చేశారో, పెట్రోలు క్యాన్లు తెచ్చి కార్లను తగలబెట్టే ప్రయత్నం చేశారో, మనుషుల తలలను పగులగొట్టే ప్రయత్నం ఎలా జరిగిందో, ఇనుప రాడ్లు, కర్రలు ఎలా వాడారో చూసిన తర్వాత ఓటర్లు ఏ ధైర్యంతో 4కి.మీ. ప్రయాణం చేసి నల్లపురెడ్డిపల్లెకు వెళ్లి ఓటు ఎలా వేయగలరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇలా ఎందుకు చేశారనేది ఆలోచిస్తే కేవలం పోలింగ్ శాతం తగ్గించడానికి, పోలింగ్ బూత్‌లలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసేందుకా అనిపిస్తోందన్నారు.
అధికార పార్టీ ప్రభావంతోనే..
ప్రతి ఒక్కరు ఓటు వేసే సౌలభ్యం కల్పించాల్సిన ఎలక్షన్ కమిషన్, ఇవాళ రూలింగ్ పార్టీ ప్రభావంతో పనిచేస్తోందన్నారు. ఈ ఓటర్ల మార్పు ఆరు పోలింగ్ కేంద్రాలపై ఉందని...అంటే 3,900 ఓట్ల మీద ఉందని, ఈ ఎలెక్షన్ 10,600 ఓట్లకు కాగా, 36 శాతం ఓటర్లకు ఈ సమస్య ఉంటుందన్నారు. ఇప్పటికే ఇష్టమొచి్చనట్లు తమ కార్యకర్తలపై బైండోవర్, తప్పుడు కేసులు పెడుతున్నారని, ఇవన్నీ సరిపోవన్నట్లు ఇంకో ఘనకార్యం చేశారని.. బూత్‌లు షిఫ్ట్ కాకుండా ఓటర్లనే వేరే ఊరికి షిఫ్ట్ చేశారని చెప్పారు.
విషయం తమకు తెలిసిన వెంటనే ఎన్నికల కమిషన్, కలెక్టర్, ఎన్నికల అధికారి తదితరుల దృష్టికి తీసుకెళ్లామని, తమ నాయకులు కూడా వాళ్లను కలుస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో దీనిని సరిదిద్ది ఏ ఊరి ఓటరు ఆ ఊరిలోనే స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ టీడీపీ ప్రభావం నుంచి బయటకు రావాలన్నారు.
ఎన్నికల కమిషన్‌కు చాలా వినతులు చేశామని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలెక్షన్ కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద, పరిసరాలలో కూడా సీసీ కెమెరాలను అమర్చాలని అడిగామన్నారు. ముఖ్యంగా సైక్లింగ్, రిగ్గింగ్ జరగకుండా ఉండాలంటే కంప్లీట్ సీసీ ఫుటేజీ ఎన్నికల కమిషన్ వద్ద ఉండాలన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కోర్టుకు కూడా వెళతామన్నారు.