
రేణిగుంట: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌చార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో న్యాయస్థానం నిందితులకు ఆగస్టు 8 వరకు రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో చెన్నై జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వినుత కోటతో పాటు మిగిలిన నిందితులను చెన్నై సీ–3 పోలీసులు కస్టడీకి కోరడంతో ఎగ్మోర్ కోర్టు అనుమతిచ్చింది. దీంతో పోలీసులు వారిని జైలుకు తరలించారు.
కాగా, డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినుత, ఆమె భర్త చంద్రబాబు నాయుడుతో పాటు ఐదుగురిని చెన్నై పోలీసులు ఈ నెల 12న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. షేక్ దస్తా సాహెబ్, శివకుమార్, గోపి ఇతర నిందితులు. రాయుడిని దారుణంగా హత్య చేసి.. జూలై 8న ఉత్తర చెన్నైలోని కూవం నదిలో శవాన్ని పడేసినట్టు తమిళనాడు పోలీసులు గుర్తించారు. కారు నంబరు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి దీనంతటికీ కారణమని వినుత, చంద్రబాబు ఆరోపించారు. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతామని వారు అన్నారు. కేసును పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రాయుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.