
30న నింగిలోకి ఉపగ్రహం
ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తల సన్నద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 30వ తేదీ సాయంత్రం 5.40 గంటలకు 2,392 కిలోల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. జియో సింక్రనస్ లాంఛింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16) రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. మూడు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేసి ప్రయోగవేదికకు తరలించి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సోమవారం మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహిస్తారు.
అనంతరం ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించనున్నారు. వారు లాంచ్ రిహార్సల్ నిర్వహించిన తరువాత ప్రయోగం, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రయోగాన్ని 19 నిమిషాల్లో పూర్తి చేసేలా రూపొందించారు. షార్ నుంచి 102వ ప్రయో గం, జీఎస్‌ఎల్‌వీ మార్క్2 సిరీస్‌లో 18 ప్రయోగం కావడం విశేషం. ఈ ప్రయోగాన్ని మూడు దశల్లో పూర్తి చేయనున్నారు.
ఇవీ దశలు
» 51.70 మీటర్లు పొడవున్న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 రాకెట్ భూమి నుంచి నింగికెగసే సమయంలో 420.5 టన్నులు బరువు కలిగి ఉంటుంది.
» నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు సాయంతో మొదటిదశ ప్రారంభమవుతుంది.
» ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 40 టన్నుల ద్రవ ఇంధనం నింపుతారు. నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో కలిపి 160 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్ దశలో 139 ఘన ఇంధనంతో మొదటి దశను, ఘన, ద్రవ ఇంధనాలను మిళితం చేసి 151.2 సెకెండ్లలో మొదటిదశ పూర్తి చేసే విధంగా రూపొందించారు.
» 420.5 టన్నుల బరువును భూమినుంచి తీసుకెళ్లాలి కాబట్టి మొదటిదశలో నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లతో పాటు కోర్ అలోన్ దశతో కలిపి 299 టన్నుల ద్రవ, ఘన ఇంధనంతో కలగలిపి మొదటిదశను పూర్తి చేస్తారు.
» రాకెట్ శిఖర భాగంలో ఉపగ్రహానికి అమర్చిన హీట్‌షీల్డ్స్ 171.20 సెకెండ్లకు మొదటి దశ రెండోదశకు మధ్యలోనే విడిపోతాయి.
» 40 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 293.08 సెకెండ్లకు పూర్తి అవుతుంది.
» ఆ తరువాత అత్యంత కీలక దశ అయిన క్రయోజనిక్ దశలో 15 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1106.60 సెకెండ్లకు మూడోదశను కటాఫ్ చేస్తారు.
» జీఎస్‌ఎల్‌వీ ఎఫ్16 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 2,392 కిలోలు బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లి 1115.60 సెకెండ్లకు (19 నిమిషాలకు) 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
» అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ తమ ఆ«దీనంలోకి తీసుకుని పనితీరును పర్యవేక్షిస్తుంది.