
ఈ నెల 30న శ్రీహరికోట నుంచి ప్రయోగం
విపత్తులపై కీలక సమాచారం అందించనున్న శాటిలైట్ ఇస్రో– నాసా సంయుక్త కృషి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ (నాసా–ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్–నిసార్) ఉపగ్రహాన్ని ఈ నెల 30 సాయంత్రం ప్రయోగించనున్నారు. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్), శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ 16 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపేందుకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులను వేగంగా పూర్తిచేస్తున్నారు. ప్రయోగం వాస్తవానికి జూన్‌లో జరగాల్సి ఉండగా, పీఎస్‌ఎల్‌వీ–సీ61 విఫలమైన నేపథ్యంలో ఇది వాయిదా పడింది.
ఉపగ్రహ విశేషాలు...
బరువు: సుమారు 2,800 కిలోలు
కక్ష్య: లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ).
శ్రేణి: సుదూర పరిశీలన ఉపగ్రహ(ఆర్‌ఎస్‌ఎస్).
సాంకేతికత: డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్).
రాడార్లు: ఈ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సిం«థటిక్ ఎపర్చర్ రాడార్‌ను ఇస్రో, ఎల్ బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్‌ను నాసా రూపొందించాయి. ఈ రెండు రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిఫ్లెక్టర్ యాంటెన్నాను కలిగి ఉంటాయి. ప్రయోగంలో నాసా అందించిన ఇతర కీలక పరికరాలు.. ఇంజినీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా సబ్‌సిస్టమ్, హై–రేట్ సైన్స్ డౌన్‌లింక్ వ్యవస్థ, జీపీఎస్ రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లు.
సామర్థ్యం: 12 రోజుల్లో భూమిని మొత్త మ్యాప్ చేయగల సామర్థ్యం ఈ శాటిలైట్ సొంతం. బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ (యూఆర్‌ఎస్‌సీ)లో శాటిలైట్ ను రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా భూ మికి సంబం«ధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రయోజనాలు...
» నిసార్ ఉపగ్రహం నుంచి పొందే అధిక రిజల్యూషన్ డేటా ద్వారా భారతదేశ తీరప్రాంతాల పర్యవేక్షణ
» డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పుల అధ్యయనం
» సముద్రంపై మంచు కదలికల పరిశీలన
» అంటార్కిటిక్ పోలార్ స్టేషన్‌ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాలు పరిస్థితుల పర్యవేక్షణ
» పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవవైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదలసహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ