పెరిగిన ‘పులి’కేక | International Tiger Day on July 29: Tiger population increased to 3200 with Tiger Reserves | Sakshi
Sakshi News home page

పెరిగిన ‘పులి’కేక

Jul 29 2025 5:01 AM | Updated on Jul 29 2025 5:01 AM

International Tiger Day on July 29: Tiger population increased to 3200 with Tiger Reserves

1972 నాటికి దేశంలో 1,827కి పడిపోయిన పులుల సంఖ్య

టైగర్‌ రిజర్వులతో 3,200కి పెరిగిన పులుల సంఖ్య 

18 రాష్ట్రాల్లో 58 టైగర్‌ రిజర్వులు 

దేశంలో అతిపెద్ద టైగర్‌ రిజర్వుగా నాగార్జునసాగర్‌–శ్రీశైలం 

నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం

సాక్షి, అమరావతి: మన దేశంలో పులుల గర్జనలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన ఈ వన్యప్రాణుల సంఖ్య పెంచేందుకు దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టులలో ‘ఇండియా ప్రాజెక్ట్‌ టైగర్‌’ ఒకటిగా నిలిచింది. నేడు ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్టు అమలు, మన దేశంలో పులుల చరిత్ర ఆసక్తికరంగా మారింది.  

పులుల అవసరం ఎందుకంటే? 
పర్యావరణ వ్యవస్థలో పులుల ప్రాముఖ్యత అమూల్యం. పులులు ఉన్న చోట అటవీ వ్యవస్థ బలంగా ఉంటుంది. పులులు ఉన్న ప్రాంతాలు నీటి వనరులు, పచ్చదనం, వన్యప్రాణులకు మూలస్థానంగా ఉంటా­యి. వాటిని సంరక్షించడం అంటే నీటి సంరక్షణ, ప్రకృతి సంరక్షణ. ఒక అడవిలో పులి ఉండడాన్ని ఆరోగ్యవంతమైన ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. పులులను కాపాడితే అడవులు స్థిరంగా ఉండి మానవ మనుగడకు అవసరమైన ఆక్సిజన్‌ అందుతుంది. కానీ ఇప్పటికీ అక్రమ వేట, అడవి నాశనం వల్ల పులులు ప్రమాదంలో ఉన్నాయి.  

అప్పట్లో 40 వేల పులులు 
20వ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో సుమారు 40 వేల పులులు ఉండేవని అంచనా. కొందరు నిపుణుల లెక్కల ప్రకారం ఈ సంఖ్య లక్షకుపైనే. కానీ రాజులు, జమీందార్లు పులుల్ని వేటాడడం గొప్పగా భావించడం, పులుల అవయవాలు ధరిస్తే మంచి జరుగుతుందనే మూఢ నమ్మకం కారణంగా వాటిని వేటాడి ఇష్టానుసారం చంపేశారు. దీంతో 1972 నాటికి దేశంలో కేవలం 1,827 పులులు మాత్రమే మిగిలాయి. కేవలం 70 ఏళ్లలో పులుల జనాభా 95 శాతం తగ్గిపోయింది. దీంతో పర్యావరణ పరిరక్షణ, అడవుల మనుగడ ప్రమాదకరంగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే 1973లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్‌ టైగర్‌ను ప్రారంభించింది. మన దేశంలో నివసించే బెంగాల్‌ టైగర్‌ జాతి పులులను, వాటి సహజ నివాసాలను సంరక్షించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.  

9 రిజర్వుల నుంచి 58 టైగర్‌ రిజర్వులకు... 
ఈ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా పులుల ఆవాసాల కోసం కోర్, బఫర్‌ జోన్‌ వ్యూహాన్ని అనుసరించారు. పూర్తిగా పులులు నివాసం ఉండేలా ప్రధాన ప్రాంతాలు (కోర్‌), పరిమితమైన మానవ సంచారం ఉండేలా అటవీ పరిసర ప్రాంతాల్లో బఫర్‌ జోన్లలో టైగర్‌ రిజర్వులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ)ను స్థాపించారు. 1972 వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏర్పడిన ఈ సంస్థ పులుల సంరక్షణ, నియంత్రణ, నిధుల పంపిణీ వంటి విషయాలను చూస్తోంది. 1972లో ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాటికి దేశంలో 9 టైగర్‌ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. 50 ఏళ్ల తర్వాత తిరిగి చూసుకుంటే వాటి సంఖ్య 18 రాష్ట్రాల్లో 58కి పెరిగింది.

దేశంలో అత్యంత పేరొందిన పులి.. మచ్లి 
మన దేశంలో ఇప్పటివరకు ఉన్న పులుల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన పులి మచ్లి. రాజస్థాన్‌లోని రణథంబోర్‌ రిజర్వులో ఇది ఉండేది. ప్రపంచంలో అత్యధిక ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీసిన పులి ఇదే. రెండేళ్ల నుంచే వేట ప్రారంభించింది. 14అడుగుల మొసలిని చంపడంతో దీని పేరు మార్మోగింది. ఈ పోరులో తన రెండు దంతాలు కోల్పోయినా దాని ధైర్యం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది. ఐదుసార్లు గర్భం దాల్చి 11 పులి పిల్లలను కని.. పెంచడం ద్వారా రణథంబోర్‌ టైగర్‌ రిజర్వులో పులుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. క్వీన్‌ ఆఫ్‌ రణథంబోర్‌గా ప్రసిద్ధి పొందిన మచ్లి 2016లో మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement