అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు

INTER BOARD SECRETARY RAMAKRISHNA SAID CRIMINAL CASE IF HIGH FEES - Sakshi

సాక్షి, అమరావతి: విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాల ప్రయోజనాల కోసమే ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లలో ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. ఈ విధానానికి అందరి నుంచి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలిదశ అడ్మిషన్లకు ఇప్పటివరకు 2.60 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. బోర్డు ఎక్కడా కొత్తగా ఏ నిబంధననూ మార్పు చేయలేదని వివరించారు. గతంలో ఆఫ్‌లైన్‌లో జరిగే పద్ధతినే ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మార్చామని పేర్కొన్నారు. తొలివిడత ఆన్‌లైన్‌ అడ్మిషన్ల దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో రామకృష్ణ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఆన్‌లైన్‌ అడ్మిషన్ల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా సమయంలో కాలేజీల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుందన్నారు. ఇంట్లో నుంచే తమకు నచ్చిన కాలేజీలో, కోరుకున్న గ్రూపులో సీటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆధార్, కొన్ని సర్టిఫికెట్ల నంబర్లను నమోదు చేసి విద్యార్థులు ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ పొందొచ్చని చెప్పారు. ఎక్కడా ఎవరికీ ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు కూడా ఆన్‌లైన్‌ అడ్మిషన్లవల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. తమ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులను ఫీజులు కట్టించుకొని చేర్పించుకోవడం వరకే వాటి బాధ్యత అని స్పష్టం చేశారు. రామకృష్ణ ఇంకా ఏమన్నారంటే..  

నిర్దేశిత ఫీజులనే కళాశాలలు తీసుకోవాలి..  
పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజులను ఖరారు చేసింది. ఆ మేరకు మాత్రమే ఆయా కాలేజీలు ఫీజులు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా నిర్దేశిత ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ కాలేజీ అయినా ఎక్కువ ఫీజులు డిమాండ్‌ చేస్తే.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. వాటిని ప్రాసిక్యూషన్‌ చేయించే అధికారం ఇంటర్‌ బోర్డుకు ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ క్యాపిటేషన్‌ ఫీ) చట్టం–1983లోని సెక్షన్‌ 9, 10, 11 ప్రకారం ప్రభుత్వం గతేడాది మార్చిలో జీవో 57 ద్వారా బోర్డుకు ప్రత్యేకాధికారాలు కల్పించింది.  

అందరికీ అందుబాటులో సీట్లు 
రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ సహా ఇతర యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌లో 6 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సీట్లు రావన్న ఆందోళన వద్దు. సెక్షన్‌కు 88 మందిని అనుమతిస్తున్నాం. రిజర్వేషన్ల ప్రకారమే ప్రతి కాలేజీలో సీట్ల భర్తీ ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల వారికి సీట్లు దక్కుతాయి. గతంలో రిజర్వేషన్ల అమలు సరిగా లేనందున కొన్ని కాలేజీల్లో కొందరికి మాత్రమే అవకాశం దక్కేది. దీంతో రిజర్వుడ్‌ వర్గాల పిల్లలు నష్టపోవాల్సి వచ్చేది. తొలి దశ అనంతరం మిగిలిన సీట్లకు మలివిడత ఆన్‌లైన్‌ ప్రవేశాలుంటాయి. గతేడాది మొత్తం 3.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేస్థాయిలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం.  

విద్యార్థుల మేలుకే ఆన్‌లైన్‌ సేవలు 
గతంలో కొన్ని కాలేజీలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ముఖ్యంగా కరోనా సమయంలో పిల్లలు కాలేజీల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ–హాల్‌టికెట్లను బోర్డు ప్రవేశపెట్టింది. బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని నేరుగా పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పించాం. పరీక్ష ఫీజుల విషయంలోనూ కాలేజీలు విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసేవి. దీంతో ఆన్‌లైన్‌లో చెల్లించే ఏర్పాటు చేయడంతో కార్పొరేట్‌ కాలేజీల అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అలాగే విద్యార్థులు ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్ల(టీసీ) విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో నేరుగా బోర్డు నుంచి ఈ–టీసీ జారీ చేసే ప్రక్రియపై దృష్టి సారించాం. దీని ద్వారా విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్‌సైట్‌ నుంచి టీసీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top