యుద్ధనౌక సూరత్‌.. సిద్ధమైంది.! | Sakshi
Sakshi News home page

యుద్ధనౌక సూరత్‌.. సిద్ధమైంది.!

Published Sun, Nov 5 2023 4:03 AM

INS Surat will be launched tomorrow - Sakshi

సాక్షి, విశాఖపట్నం: తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్‌ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ సూరత్‌ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్‌ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్‌లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన  ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు.  

ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక.. 
ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్‌ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్‌ మర్ముగావ్, ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి.

తాజాగా చివరి నౌకగా ఐఎన్‌ఎస్‌ సూరత్‌ వార్‌ షిప్‌ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్‌కు సంబంధించి 2018 జూలైలో కీల్‌ నిర్మించగా.. 2022 మే 17న షిప్‌ తయారీ పనుల్ని బ్లాక్‌ కనస్ట్రక్షన్‌ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్‌లో ప్రధాన ఓడరేవు అయిన పోర్‌బందర్‌ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్‌ఎస్‌ సూరత్‌గా నామకరణం చేశారు.

ఈ 4 షిప్స్‌ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్‌ఎస్‌ సూరత్‌ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్‌ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్‌ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్‌లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్‌ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. 

బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం 
విశాఖపట్నం–క్లాస్‌ స్టెల్త్‌ గైడెడ్‌–మిసైల్‌ డిస్ట్రాయర్ యర్‌ నౌకల్లో ఆఖరిది ఐఎన్‌ఎస్‌ సూరత్‌. విశాఖపట్నం క్లాస్‌ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్‌ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్‌తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధ నౌక విశేషాలు.. 
బరువు: 7,400 టన్నులు 
పొడవు: 163 మీటర్లు 
బీమ్‌: 17.4 మీటర్లు 
డ్రాఫ్ట్‌: 5.4 మీటర్లు 
వేగం: గంటకు 30 నాటికల్‌ మైళ్లు (56 కిమీ) 
స్వదేశీ పరిజ్ఞానం: 80 శాతం 
పరిధి: 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్‌ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా  
సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది 
సెన్సార్స్, ప్రాసెసింగ్‌ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్‌ రాడార్, బ్యాండ్‌ ఎయిర్‌ సెర్చ్‌ రాడార్, సర్ఫేస్‌ సెర్చ్‌ రాడార్‌ 

ఆయుధాలు: 32 బరాక్‌ ఎయిర్‌ క్షిపణులు, 16 బ్రహ్మోస్‌ యాంటీషిప్, ల్యాండ్‌ అటాక్‌ క్షిపణులు, 76 ఎంఎం సూపర్‌ రాపిడ్‌ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్‌ లాంచర్స్‌ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్‌ లాంచర్లు 

విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్‌ సీకింగ్‌ విమానాలు లేదా రెండు హెచ్‌ఏఎల్‌ ధృవ్‌ విమానాలు తీసుకెళ్లగలదు 

ఏవియేషన్‌ ఫెసిలిటీ: రెండు హెలికాప్టర్లు ల్యాండ్‌ అయ్యే సౌకర్యం ఎల్రక్టానిక్‌ వార్‌ఫేర్‌: డీఆర్‌డీవో శక్తి సూట్, రాడార్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు, 4 కవచ్‌ డెకాయ్‌ లాంచర్లు, 2 కౌంటర్‌ టార్పెడో సిస్టమ్స్‌.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement