INS Khukri: ‘సాహసిక’..  సెలవిక

INS Khukri India Built Missile Decommissioned After 32 Years - Sakshi

విధుల నుంచి నిష్క్రమించిన భారత యుద్ధనౌక ఖుక్రి

స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి క్షిపణి సామర్ధ్య యుద్ధ నౌక

శత్రు నౌకలను క్షిపణులతో తుత్తునియలు చేయగల సామర్ధ్యం

భారత రక్షణ సేవలో 32 ఏళ్లు

30 సార్లు ప్రపంచాన్ని చుట్టివచ్చినంత ప్రయాణం 

పాక్‌తో యుద్ధంలో ధ్వంసమైన నౌక పేరుతో ఖుక్రీ తయారీ  

సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్‌ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్‌గావ్‌ డాక్‌లో తయారైన ఐఎన్‌ఎస్‌ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు.

తూర్పు నౌకా దళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్‌ పెనెంట్‌ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్‌ అయిన కమాండింగ్‌ అధికారుల్ని వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్‌ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీఎన్‌ అనంతనారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్‌ఎస్‌ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

సాహసానికి ప్రతీక
ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ ఖుక్రి పాక్‌ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్‌మెరైన్‌ పీఎన్‌ఎస్‌ హన్‌గోర్‌లో పొంచి ఉన్న పాక్‌ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్‌ అధికారి కెప్టెన్‌ మహింద్రనాధ్‌ ముల్లా తన లైఫ్‌ జాకెట్‌ని జూనియర్‌ ఆఫీసర్‌కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు.

ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్‌పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్‌ మహింద్రనాధ్‌ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్‌ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్‌ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top