'హర్ష'పాతం

Influence of abundant south-west monsoon Andhra Pradesh - Sakshi

ఈ సీజన్‌లో సమృద్ధిగా నైరుతి రుతుపవనాల ప్రభావం

20 జిల్లాల్లో సాధారణం.. ఐదు జిల్లాల్లో అధిక వర్షపాతం

సాక్షి, విశాఖపట్నం: కరువు ఛాయల్లేకుండా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సమృద్ధిగా వర్షాలు కురిపించాయి. ఏటా జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఇవి ప్రభావం చూపుతాయి. ఖరీఫ్‌ పంటలకు ఈ రుతుపవనాలే కీలకం. అందుకే నైరుతి రుతుపవనాల ప్రభావం ఎలా ఉంటుందోనని ఇటు రైతులు, అటు ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తి చూపుతాయి. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు ఇప్పటివరకు వానల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు.

తరచూ తేలికపాటి నుంచి మోస్తరుగాను, అప్పుడప్పుడు భారీ వర్షాలు కురిశాయి. ఇలా వరుసగా నాలుగేళ్ల నుంచి ఖరీఫ్‌ సీజనులో వరుణుడు రాష్ట్రంలో విస్తారంగా వానలు కురిపిస్తూనే ఉన్నాడు. ఇందుకు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు ఎంతో దోహదపడ్డాయి. రుతుపవనాల సీజను మొదలైన జూన్‌ నుంచి ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏడు అల్పపీడనాలు, రెండు వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి.

కొద్దిరోజుల్లో ‘నైరుతి’ సీజన్‌ ముగింపు
ఇక మరికొద్ది రోజుల్లోనే నైరుతి రుతుపవనాల సీజను ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ (ఏపీఎస్‌డీపీఎస్‌) గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో సాధారణం, ఐదు జిల్లాల్లో అధిక, ఒక జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

విజయనగరం, కాకినాడ, బాపట్ల, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అధిక వర్షపాతం, శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. అరకొర వర్షాలతో కరువు పరిస్థితులేర్పడే అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ఏడాది సాధారణానికి మించి అధిక వర్షం కురవడం విశేషం. 

సాధారణం కంటే అధికం..
మరోవైపు.. నైరుతి రుతుపవనాల సీజనులో జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 514.7 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా 544.3 మి.మీలు కురిసింది. ఇది సాధారణం కంటే దాదాపు 6.0 శాతం అధికమన్నమాట. ఒక్క సెప్టెంబర్‌లోనే 95 మి.మీలకు గాను 115.9 మి.మీలు (22 శాతం అధికంగా) వర్షపాతం నమోదైంది. నిజానికి.. సాధారణంకంటే 20 శాతానికి పైగా తక్కువ వర్షం కురిస్తే లోటు వర్షపాతంగా పరిగణిస్తారు.

ఇలా ఈ నైరుతి రుతుపవనాల సీజనులో రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం రికార్డు కాలేదు. ఈ నేపథ్యంలో కరువు ఛాయలు ఏర్పడకుండా ఖరీఫ్‌ సీజను ముగుస్తుండడం, అవసరమైనప్పుడల్లా వర్షాలు కురుస్తూ పంటలకు ఢోకా లేకపోవడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top