కృష్ణా పల్లెలకు నిధుల వరద

Huge Funds For Villages In Krishna District - Sakshi

రూ.2,811.69 కోట్లతో అభివృద్ధి పనులు

గ్రామాలకు సరికొత్త రూపు

ప్రజల చెంతకే నాణ్యమైన వైద్యం

పంచాయతీల్లోనే సకల సేవలు

సంక్షేమానికి నిలయంగా సచివాలయాలు

గతం: పంచాయతీలకు నిధుల లేమి. చిన్నపాటి రోడ్డు వేయాలన్నా డబ్బులేని దయనీయ పరిస్థితి. కేంద్రం ఇచ్చిన నిధులు సైతం పంచాయతీల్లో ‘షాడో’లుగా పెత్తనం చేసిన టీడీపీ నాయకుల జేబుల్లోకే. ఏ పనికావాలన్నా రోజులు, నెలల తరబడి తిరగాల్సిందే. అప్పటికీ అయ్యేవి వేళ్లమీద లెక్కబెట్టగలిగినన్నే.

వర్తమానం: పంచాయతీలకు సమృద్ధిగా నిధులు. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రగతి పనులు. ప్రతిపైసా సద్వినియోగమయ్యేలా పర్యవేక్షణ. ఏపని కావాలన్నా ఊళ్లోని సచివాలయంలోనే. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ఇంటివద్దకే తెచ్చి అందిస్తున్న వలంటీర్లు. అవసరమైన నిర్మాణాలు. కొరత లేకుండా ఉపాధి పనులు.

మచిలీపట్నం: కృష్ణాజిల్లాలో పల్లెలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో.. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైంది. గ్రామాల రూపురేఖలు మారుతున్నా యి. అవసరమైన వసతులన్నీ సమకూరుతున్నాయి వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం రూ.2,811.69 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాల ఏర్పాటు తో ప్రభుత్వపరంగా అమలు చేసే సంక్షేమ పథకాల న్నీ లబ్ధిదారుల ఇంటి తలుపుతడుతున్నాయి. సచివాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం రూ.574.47 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో 809 సచివాలయ భవనాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

రైతుకు వెన్నుదన్నుగా..
రైతు రాజ్యంతోనే పల్లెలు పచ్చగా ఉంటాయని భావించిన ప్రభుత్వం, ఆ దిశగానే వారికి చేయూత ఇచ్చే కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా జిల్లాలో 801 రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. 796 చోట్ల పక్కా భవనాల నిర్మాణానికి రూ.173.52 కోట్లు మంజూరు  చేసింది. ఇప్పటికే ఈ పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ రైతులకు అన్ని రకాల సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ఖరీఫ్‌లో రైతులు తమ పంటలను విక్రయించుకునేందుకు వీలుగా జిల్లాలో 340 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని రైతుభరోసా కేంద్రాలకు అనుసంధానం చేశారు. 

పల్లె ముంగిట వైద్యం
చిన్నపాటి అనారోగ్యం వచ్చినా ప్రాణాలు అరచేత పెట్టుకుని వైద్యం కోసమని పరుగులు తీయాల్సిన రోజులు మళ్లీ చూడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్సార్‌ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు (వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు) ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసిన 658 క్లినిక్‌లకు రూ.99.21 కోట్లతో పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. ఈ భవనాలన్నీ త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రూ.70.26 కోట్లతో 12 కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పక్కాభవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. జిల్లా కేంద్రంలో రూ.550 కోట్లతో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలకు డీపీఆర్‌ సిద్ధమవుతోంది. త్వరలోనే వైద్య కళాశాల పనులు ప్రారంభం కానున్నాయి.
 
రూపుమారిన పాఠశాలలు
పల్లెల్లో విద్యా కుసుమాలు విరబూసేలా ప్రస్తుత ప్రభుత్వం చదువులకు పెద్దపీట వేస్తోంది. అధ్వానంగా ఉన్న బడుల రూపురేఖలు మార్చేలా నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో తొలివిడతలోనే 1,153 పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల పెంపునకు రూ.262.80 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ల ఏర్పాటు, ప్రహరీల నిర్మాణం, రంగులు వేయడం వంటి పనులు చేపట్టింది. ఈ పనులతో ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలల్ని తలపిస్తున్నాయి. 

మెరుగైన రహదారులు
గ్రామాల్లో రహదారులు దెబ్బతిన్నా గతంలో టీడీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16,865 చోట్ల రూ.825.76 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణం జరుగుతోంది. వీటికి అనుసంధానంగా రూ.238.68 కోట్లతో 1,080 చోట్ల డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో పంచాయతీ సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరగనున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top