ఉద్యానం.. మరింత విస్తారం

Horticulture crops target to increase by 180 acres this year - Sakshi

ఈ ఏడాది 180 ఎకరాల విస్తీర్ణం పెంపు లక్ష్యం 

ఇప్పటికే జిల్లాలో 10,328 ఎకరాల్లో ఉద్యాన పంటలు 

డ్రాగన్, టిష్యూ అరటి, బొప్పాయి సాగుకు ప్రోత్సాహం 

ఈ ఉత్పత్తుల విక్రయాలకు మార్కెటింగ్‌ శాఖతో ఒప్పందం 

సాక్షి, విశాఖపట్నం: ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రైతులకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనలో ఉద్యాన విస్తరణ పథకం కింది ఏటా కొంతమేర దీనిని విస్తరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నం జిల్లాలో 10,328 ఎకరాల ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది అదనంగా మరో 180 ఎకరాల్లో ఈ పంటలను విస్తరించాలని జిల్లా ఉద్యానశాఖ నిర్ణయించింది.

ఇందుకు అవసరమైన ప్రక్రియను ఉద్యానశాఖ అధికారులు చేపట్టారు. ఉద్యాన విస్తరణ పథకం కింద డ్రాగన్‌ ఫ్రూట్, టిష్యూ కల్చర్‌ అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలు సాగు చేస్తారు. వీటితో పాటు జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకంలో సాగు చేసే పంటలకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. మొక్కలు, ఎరువులతో పాటు సాగుకు అవసరమైన పనిముట్లకు కూడా యూనిట్‌ ధరను బట్టి గరిష్టంగా 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది.

ఇందుకోసం ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యాన సాగు పెంపు ఆవశ్యకత, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను రైతులకు వివరిస్తున్నారు. అదే సమయంలో వీటికి అర్హులైన రైతులను గుర్తింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

అనంతరం అవసరమైన నర్సరీలను కూడా ఎంపిక చేసి మొక్కలను పంపిణీ చేస్తారు. ఉద్యాన పంటల విస్తరణకు నీటి పారుదల, డ్రిప్, స్పింక్లర్లు వంటి సదుపాయాలు కలిగి ఉండాలి. మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో మొక్కలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇందుకు అవసరమయ్యే కూలీలను కూడా ఈ పథకంలో సమకూరుస్తారు. ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేకూర్చనుంది.  

మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తాం 
రైతులు పండించిన ఈ ఉద్యాన పంటలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తాం. ఈ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించేలా మార్కెటింగ్‌ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఈ రైతులకు కార్డులను జారీ చేస్తాం. ఉద్యాన పంటల నాణ్యత, దిగుబడులు పెంచడం, రైతులకు మంచి ధర గిట్టుబాటు అయ్యేలా చూడడం వంటివి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.  – మన్మధరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, విశాఖపట్నం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top