కరోనా టెస్ట్‌ల్లో బెస్ట్..

​Highest Corona Tests In Krishna District - Sakshi

 కరోనా నిర్ధారణ పరీక్షలు 3,00,973  

టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీట్‌మెంట్‌తో కట్టడి

రాష్ట్రంలోనే చివరి స్థానంలో కృష్ణా జిల్లా 

పదిహేను రోజులుగా అతి తక్కువ సంఖ్యలో కేసుల నమోదు

లబ్బీపేట (విజయవాడ తూర్పు):  కరోనా నిర్ధారణ పరీక్షలు రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా కృష్ణాజిల్లాలో నిర్వహించారు. ఈ నెల 22వ తేదీ  నాటికి జిల్లాలో 3,00,973 మందికి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖల సమన్వయంతో టెస్టింగ్‌.. ట్రేసింగ్‌.. ట్రీట్‌మెంట్‌ విధానంతో మొదటి నుంచి అప్రమత్తంగా పనిచేశారు. వీరి కృషి ఫలించింది. ప్రస్తుతం రాష్ట్రంలోనే తక్కువ కేసులు నమోదైన జిల్లాగా కృష్ణాజిల్లా నిలిచింది. అంతేకాదు ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో తక్కువ పాజిటివ్‌ కేసులు జిల్లాలోనే నమోదవుతుండటంపై అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  

పరీక్షలు ఇలా.. 
జిల్లాలో ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 20 బస్సులు, మరో 15 బృందాలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆయా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలు నిర్వహించారు. 
వివరాలు ఇలా.. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలోని వీఆర్‌డీఎల్‌ లేబొరేటరీలో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు 2,18,128 చేశారు. కాగా, ట్రూనాట్‌ పరీక్షలు సిద్ధార్థ వైద్య కళాశాలలో 19,147, నూజివీడు ఏరియా ఆస్పత్రిలో 8,425, జిల్లా ఆస్పత్రి మచిలీపట్నంలో 7,539, గన్నవరం వెటర్నరీ కళాశాలలో 3,407, గుడివాడ ఏరియా ఆస్పత్రిలో 470, జగ్గయ్యపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 540, విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో 231, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు 16,304, క్లియా పరీక్షలు 6,992, సిద్ధార్థ వైద్య కళాశాలలోని సీబీనాట్‌ పరీక్షలు 112, ఇతర ల్యాబ్‌లలో 19,678 పరీక్షలు నిర్వహించారు.  

కేసుల నమోదులో చివరి స్థానంలో.. 
ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల్లో జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు తూర్పు గోదావరిజిల్లాలో 49,245 నమోదు కాగా, తర్వాతి స్థానంలో కర్నూలులో 38,835, అనంతపురంలో 34,793, చిత్తూరులో 29,830, పశ్చిమ గోదావరిలో 29,860 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 30,392 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో కేవలం 13,875 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జూన్‌ ఆఖరులో అత్యధిక కేసులు నమోదు కాగా, కర్నూలు , తూర్పుగోదావరి తర్వాత మూడో స్థానంలో ఉంది. అనంతరం కేసులు కట్టడి చేయడంతో  కేసులు క్రమేణ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కంటే తక్కువగా కేసులకు చేరుకోగలిగింది. అంతేకాదు పదిహేను రోజులుగా అతితక్కువ కేసులు నమోదవుతున్నది కృష్ణాజిల్లాలోనే.  

ఫలించిన సమష్టి కృషి 
జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ నేతృత్వంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేసిన కృషి ఫలించింది. ప్రభుత్వం తొలుత జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతుండటంతో పరీక్షలు చేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న హాట్‌ స్పాట్‌లను గుర్తించడం, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, పాజిటివ్‌ వచ్చిన వారిని హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉంచడం, సౌకర్యం లేని వారికి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లకు తరలించడం పక్కాగా అమలు చేశారు. ప్రజలు బయట తిరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రజల్లో అవగాహన కల్పిచండంతో సత్ఫలితాలు సాధించగలిగారు. విస్తృతంగా పరీక్షల కోసం ఏ జిల్లాలో లేని విధంగా 19 ఐమాస్క్‌ బస్సులు, మూడు సంజీవని బస్సులో కేటాయించింది. దీంతో పరీక్షలు వేగవంతం చేయడం, పాజిటివ్‌ కేసులను సత్వరమే గుర్తించడంతో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో కృషి ఫలించింది. 

ప్రజల సహకారంతోనే
కరోనా విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగింది. స్వచ్ఛందంగా పరీక్షల కోసం ముందుకు వచ్చే విధంగా చేశాం. పాజిటివ్‌ వస్తే లక్షణాలు లేకుంటే హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉండే విధంగా చూశాం. అన్ని శాఖలు ఐదు నెలలుగా అవిశ్రాంతంగా చేస్తున్న కృషి ఫలించింది.  ప్రజల్లో మార్పు ద్వారానే అరికట్టగలిగాం. 
– డాక్టర్‌ ఐ.రమేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి 

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top