బ్రహ్మంగారి మఠం వద్ద టెన్షన్‌.. పోలీసుల మోహరింపు

High Tension At Brahmamgari Matam - Sakshi

విశ్వబ్రాహ్మణ సంఘం ఛైర్మన్‌ శ్రీకాంత్‌ ఆచారిని అడ్డుకున్న మఠం నాయకులు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద సోమవారం టెన్షన్‌ నెలకొంది. విశ్వబ్రాహ్మణ సంఘం ఛైర్మన్‌ శ్రీకాంత్‌ ఆచారిని మఠం నాయకులు అడ్డుకున్నారు. మఠం వివాదంపై మీడియాతో మాట్లాడుతున్న శ్రీకాంత్ ఆచారిపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల రంగ ప్రవేశంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

కాగా, బ్రహ్మంగారి మఠం వారసత్వంపై వివాదం కొనసాగుతోంది. ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది.

ఇదిలా ఉంటే, చారిత్రక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఖ్యాతి, గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసేందుకు ధార్మిక పరిషత్‌ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలకు దేవదాయ శాఖ ఉపక్రమించింది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

బ్రహ్మంగారి మఠం తరహా సంప్రదాయం కలిగి ఉండే మఠాధిపతులు, భక్తులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి, దాని సూచనల మేరకు ధార్మిక పరిషత్‌ ద్వారా తదుపరి మఠాధిపతిని ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు మఠానికి తాత్కాలిక ఫిట్‌పర్సన్‌ (పర్సన్‌ ఇన్‌చార్జి)గా వైఎస్సార్‌ కడప జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శంకర్‌ బాలాజీని నియమించారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు.  

చదవండి: వీలునామాలకు ఆస్కారంలేదు 
మఠాధిపత్యంపై పీఠాధిపతులతో కమిటీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top