
హైకోర్టులో ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం పిటిషన్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం
సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ), వేతన సవరణ (పీఆర్‌సీ) బకాయిలను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రెజరీస్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు పిటిషనర్ సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కరువు భత్యం, వేతన సవరణ బకాయిలను చెల్లించలేదన్నారు.
కొత్త పెన్షన్ స్కీం ప్రకారం 90 శాతం బకాయిలను నగదు రూపంలోనే చెల్లించాల్సి ఉందన్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని పదవీ విరమణ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన పలు ఉత్తర్వులు అమలు కాలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.