
విశాఖ, ప్రకాశం, పల్నాడు జిల్లాల పోలీసులను తప్పుపట్టిన హైకోర్టు
పీఎల్‌సీఎఫ్ పేరుతో ఎలా జోక్యం చేసుకుంటారు?
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం మీకు లేదు
వాటి పరిష్కారానికి సివిల్ కోర్టులు, న్యాయ సేవాధికార సంస్థలున్నాయని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి : సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మండి పడింది. భూమికి సంబంధించిన సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. వ్యక్తుల మధ్య భూ వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) కింద సివిల్ కోర్టులు ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే న్యాయ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు చట్టబద్ధ సంస్థలైన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని గుర్తు చేసింది.
సివిల్ వివాదాలను పరిష్కరించేందుకు పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం (పీఎల్‌సీఎఫ్) పేరుతో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారుల మనసులో ఓ రకమైన కలవరపాటు కలగడంతో పాటు పుట్టగొడుగుల్లా వివాదాలు మొదలవుతాయ ని చెప్పింది. భూ వివాదాల పరిష్కారానికి ఏ పేరుతో కూడా సివిల్ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని విశాఖపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
74 ఏళ్ల వృద్ధురాలి న్యాయ పోరాటం
ఓ సివిల్ వివాదంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తనను పదే పదే పిలిపిస్తూ వేధిస్తున్నారని, సివిల్ వివాదంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం బే కాలనీకి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఎస్.శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ లక్ష్మణరావు ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వట్టికూటి సూర్య నారాయణ వాదనలు వినిపిస్తూ.. వెంకట సత్య నాగ కృష్ణంరాజు, గోపాలరాజు, వెంకట సత్యనారాయణ రాజులతో శ్యామలకు సివిల్ వివాదం కొనసాగుతోందన్నారు.
పోలీసులు ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ ఫోరం పేరుతో సివిల్ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్‌ను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరారు. ప్రీ లిటిగేషన్ కౌన్సిలింగ్ ఫోరం పేరుతో వివాద పరిష్కారానికి పార్టీలను కౌన్సిలింగ్‌కు పిలిపిస్తుంటామని పోలీసులు తెలిపారు. ఒకవేళ పార్టీలు కౌన్సిలింగ్‌కు రాకూడదనుకుంటే రావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, భీమునిపట్నం పోలీసుల పాత్ర లేదని చెప్పారు.
పిటిషనర్ వివాద పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసును మూసి వేశామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసుల తీరును ఆక్షేపించారు. పిటిషనర్ అయిన వృద్ధురాలికి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం పూర్తిగా సివిల్ వివాదమని, ఇలాంటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. ప్రీ లిటిగేషన్ కౌన్సెల్ ఫోరం పేరుతో సివిల్ వివాదాలను పరిష్కరించడానికి వీల్లేదన్నారు.
ప్రకాశం, పల్నాడు పోలీసులకు సైతం ఆదేశాలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు పోలీసులు ఓ సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని సివిల్ కోర్టులో దాఖలు చేసిన సివిల్ సూట్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయడాన్ని కూడా జస్టిస్ లక్ష్మణరావు తప్పుపట్టారు. అలా చేయొద్దని పోలీసులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకు కూడా న్యాయమూర్తి ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. కింది కోర్టులో వేసిన సూట్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను పోలీసులు బెదిరించడాన్ని ఆక్షేపించారు.