
సాక్షి, విశాఖ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు.. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
🔸ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపిలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు
🔸అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
🔸మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం pic.twitter.com/NCNsiHxmKQ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 9, 2025