
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థుల ‘స్థానికత’ వివాదంపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఏపీ వెలుపల ఇంటర్ విద్యను అభ్యసించినప్పటికీ తామంతా రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్నామని, అందువల్ల తమను ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో ‘స్థానిక’ అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు దర్మాసనం.. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ వ్యాజ్యాలన్నింటినీ కొట్టేసింది. స్థానికత విషయంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే చాలా స్పష్టమైన తీర్పునిచి్చందని, ఇప్పుడు తాము అందుకు భిన్నంగా చెప్పాల్సింది ఏమీ లేదని తన తీర్పులో పేర్కొంది. ప్రవేశాలు కోరుతున్న విద్యార్థి, తాను ఏ లోకల్ ఏరియా (ఎస్‌వీ యూనివర్సిటీ లేదా ఆంధ్రా యూనివర్సిటీ పరిధి)లో చదివానని చెబుతున్నారో, ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆ నాలుగేళ్లను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ (+2 అంటే ఇంటర్)తో ముగించి ఉండటం తప్పనిసరి అని తేల్చి చెప్పింది. అలాగే ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ క్వాలిఫైయింగ్ పరీక్ష రాసే నాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థే అవుతారని స్పష్టం చేసింది. రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌కు ముందు +2 చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ 53 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విపిన్ నాయర్ సుప్రీంను కోరారు. అంగీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.