తపస్వి కేసు: షాకింగ్‌ ట్విస్ట్‌.. ప్రేమికుడు కాదు కేటుగాడు

Guntur Dental Student Murder: Tapasvi Cheated By Lover - Sakshi

సాక్షి, గుంటూరు:  గుంటూరు తక్కళ్లెపాడులో సోమవారం ఘోర హత్యకు గురైన తపస్వి కేసు దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తపస్విని వేధించిన జ్ఞానేశ్వర్‌ అలియాస్‌ డింపు అసలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాదని, పెయింటింగ్‌ పనులకు వెళ్లే కూలీ అని పోలీసులు ధృవీకరించారు. కులం విషయంలోనే కాదు.. తనకు మంచి జాబ్‌ ఉందంటూ తపస్విని అతను మోసం చేశాడని, అది బయటపడేసరికి.. ఆమె దూరం పెట్టడంతో ఇలా ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమిక విచారణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. 

మన్నే జ్ఞానేశ్వర్ అలియాస్ డింపు  మానికొండ వాసి. రెండేళ్ల కిందట ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తపస్వితో పరిచయం చేసుకున్నాడు. ఆమె పెట్టే ప్రతీ పోస్ట్‌కి లైకులు కొడుతూ.. పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లాడు. తన ఇంటి పేరును చూపించి.. తాను అగ్ర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినంటూ ఆ పరిచయాన్ని మరో ట్రాక్‌లోకి ఎక్కించాడు. అతని మాయ మాటలకు ఆమె మోసపోయింది. మూడు నెలల కిందట ఒకరినొకరు కలుసుకున్నారు. జ్ఞానేశ్వర్‌ పుట్టిన రోజుకి బంగారంతో పాటు కానుకలు కూడా ఇచ్చింది తపస్వి. ఈ క్రమంలో.. 

తపస్వికి జ్ఞానేశ్వర్‌ నిజం చెప్పాడు. ఓ నెల క్రితం.. తాను వేరే సామాజికవర్గానికి చెందిన వ్యక్తినని, జాబ్ కూడా లేదని నిజం చెప్పాడు. దీంతో తపస్వి.. జ్ఞానేశ్వర్‌ను అసహ్యించుకుంది. దూరం పెట్టడం ప్రారంభించింది. జ్ఞానేశ్వర్‌ ఉన్మాదిలా మారాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో.. పోలీసులను ఆశ్రయించింది తపస్వి. ఆపై జ్ఞానేశ్వర్‌ను, అతని తండ్రిని పిలిచి పోలీసులు హెచ్చరించారు. కానుకలను తిరిగి తపస్వికి ఇప్పించి పంపించేశారు. 

ఇరవై రోజుల క్రితం గన్నవరంలో ఉంటున్న రూమ్ ను ఖాళీ చేసి కృష్ణాపురం వెళ్లిపోయింది తపస్వి. ఆపై పరీక్షల నేపథ్యంలో తక్కెళ్లపాడు(గుంటూరు) స్నేహితురాలు దగ్గరికి వెళ్లింది. తపస్వి మొబైల్ నంబర్, ఫేస్ బుక్,ఇన్ స్టా గ్రామ్ ఐడీ ద్వారా ఆమె ఉన్న చోటును ట్రాక్ చేసిన జ్ఞానేశ్వర్.. ట్రాకింగ్‌ ద్వారా అక్కడికి వెళ్లి మరీ ఆమెను హతమార్చాడు. ఇదిలా ఉంటే.. జ్ఞానేశ్వర్‌కు గంజాయి, మద్యం అలవాటు ఉందని స్థానికులు చెప్తున్నారు. తరచూ మొబైల్స్ మారుస్తూ.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో వేర్వేరు పేర్లతో ఐడీలు క్రియేట్ చేస్తుంటాడని స్నేహితులు చెప్తున్నారు. 

తపస్వి క్లోజ్‌ఫ్రెండ్‌ను విచారించిన పోలీసులు
బీడీఎస్‌ విద్యార్థిని తపస్వి హత్య కేసును మరింత లోతుగా విచారించాలని పోలీసులు నిర్ణయించాయి. నిందితుడు అదుపులో ఉన్నప్పటికీ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయిన తపస్వి స్నేహితురాలి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ క్రమంలోనే తపస్వి బాల్య స్నేహితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పరీక్షల సమయం కావడంతో.. తపస్వి, తక్కెళ్లపాడులోని స్నేహితురాలి దగ్గరికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్‌.. తపస్విపై దాడి చేశాడు. ఆ సమయంలో తపస్విని రక్షించడానికి ఆమె ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ఊహించిన ఆ దాడితో ఆమె షాక్‌కు గురైందట. ఇప్పటికే హత్యకు సంబంధించిన కొంత సమాచారం విభాగ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. మరింత సమాచారం కోసమే ఆమెను పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top