మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో అదానీ – గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తోందని, కానీ ఆ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఎన్ని ఉద్యోగాలొస్తాయో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని ఆ పార్టీ పశ్చి మ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు. మంగళవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అదానీ – గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ సహా కూటమి నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రస్తావించకుండా యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమితోపాటు రూ.22 వేల కోట్లు రాయితీలు ఇస్తోందని, ఇవేకాకుండా భారీ ఎత్తున నీరు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత భారీ స్థాయిలో రాయితీలు ప్రకటిస్తున్నా, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారనే దానిపై మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్టోబర్ నెలలో ఢిల్లీలో ఒప్పందం జరిగిన సందర్భంలో డేటా సెంటర్ ద్వారా 1.80 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు సహా మంత్రులు, కూటమి నాయకులు ప్రచారం చేశారని... అయితే ఒప్పందంలో మాత్రం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే అంశాన్ని గుర్తించి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీసినా.. కనీసం ఈ రోజు శంకుస్థాపన సందర్భంగానైనా సరే ఉద్యోగాల కల్పనపై ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
25 వేల ఉద్యోగాలు వచ్చేలా నాడు ప్రణాళిక
‘‘గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 130 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు ఉద్యోగాల కల్పనకు వారి నుంచి ప్రభుత్వం హామీ తీసుకుంది. డేటా సెంటర్‌కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్‌సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాలని నాడే(2021 మార్చి 9న) సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాశాం.
డేటా సెంటర్‌తోపాటు ఐటీ పార్కు, రీక్రియేషన్ సెంటర్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా అదానీతో ఒప్పందం చేసుకున్నాం. ఆ మేరకు 25 వేల మందికి ఉద్యోగాల కల్పనకు ఆ సంస్థను ఒప్పించాం. ఈ నేపథ్యంలోనే విశాఖలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశాం’ అని చెప్పారు. ‘‘డేటా సెంటర్ శంకుస్థాపన వేదిక మీద కూడా మంత్రి నారా లోకేశ్ రాజకీయాలు మాట్లాడటం ఆయన అల్పబుద్ధిని సూచిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై గొడ్డలి, లడ్డూ అంటూ లోకేశ్ చేసిన ప్రసంగం ఆయన అవివేకానికి నిదర్శనం’ అన్నారు.


