
గవర్నర్‌ను సన్మానిస్తున్న కళాశాల యాజమాన్యం
గుడ్లవల్లేరు (గుడివాడ): ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యే అని గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ(ఎస్‌జీఈసీ) రజతోత్సవాల ముగింపు సభకు ఆయన ఆదివారం హాజరయ్యారు. అబ్దుల్ కలాం చెప్పిన ప్రపంచ పురోగతి సాధించాలంటే అది విద్య అనే శక్తివంతమైన ఆయుధంతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. దానికి జాతీయ విద్యా విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
గ్రామీణ ప్రాంత వాసులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యం, దూర దృష్టి, అభిరుచి, ఆలోచనా దృక్పథాలతో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలను స్థాపించడం హర్షదాయకమన్నారు. తొలుత కాలేజీ స్థాపనతో పాటు అభివృద్ధి చేసిన వ్యవస్థాపకుడు వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావుకు కృతజ్ఞతాంజలి తెలిపిన పత్రాన్ని వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ అందజేశారు. గవర్నర్‌ను కళాశాల చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ సన్మానించారు. కలెక్టర్ పి.రాజాబాబు, గుడివాడ ఆర్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.