పాడి, ఉద్యాన రంగాలకు ఊతం

Governor Abdul Nazir in a joint meeting of both houses - Sakshi

ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్

సాక్షి, అమరావతి : ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో తృణ, చిరుధాన్యాల పంటల సాగును రాష్ట్రంలో బాగా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

ఉద్యానవన, పశుగణ, మత్స్య రంగాలు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నడిపించే వృద్ధి చోదకాలుగా గుర్తించి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్‌ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాట, కొబ్బరి, మిరప పంటల ఉత్పాదకతలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2023-24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో  ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

♦  భారతదేశంలో మామిడి, కమల, పసుపు ఉత్పత్తిలో రాష్టం 2వ స్థానంలో, సూక్ష్మ నీటి పారుదల (డ్రిప్‌ ఇరిగేషన్‌) అమలులో 3వ స్థానంలో నిలిచింది. 
దేశంలోనే ఏడాదికి గుడ్ల ఉత్పత్తిలో 2,645 కోట్ల గుడ్లతో ప్రథమ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 10.26 లక్షల టన్నులతో రెండవ స్థానంలో, పాల ఉత్పత్తిలో 154.03 లక్షల టన్నులతో 5వ స్థానంలో ఉంది.
♦ పశు ఆరోగ్య రక్షణలో భాగంగా 1962కు ఫోన్‌ చేయగానే పాడి రైతు వద్దకు వచ్చేలా రూ.252.91 కోట్ల వ్యయంతో 340 వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏర్పాటు చేసింది. 
♦ పాల సహకార సంఘాల బలోపేతానికి అమూల్‌ ప్రాజెక్ట్‌­కు­ ఎన్‌సీడీసీ ద్వారా పాడి పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి రుణంగా రూ.1,362 కోట్లు అందించింది.
♦ రూ.1,868.63 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం కింద 45-56 సంవత్సరాల మధ్య వయసున్న 2.49 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది.
♦ జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల్లో రూ.20,020 కోట్లు (35 శాతం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాటాగా ఉంది.

రాష్ట్రం పచ్చతోరణం 
రాష్ట్రంలో 26 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం పని చేస్తోంది. జగనన్న పచ్చ తోరణం కింద 2022-23లో 3.05 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఐఎస్‌ఎఫ్‌ఆర్‌-2021 (ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌) నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని 646.9 చ.కి.మీ మేరకు పెంచడంలో ఆంధ్రప్రదేశ్‌  మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు 2023-24లో రాష్ట్రంలోని 23 ప్రదేశాలలో నగరవనాలు/దేవాలయ ఎకో పార్కులను అభివృద్ధి చేయనుంది.

స్వచ్ఛ భారత్‌ సంకల్పానికి నిదర్శనం 
క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ కోసం 2022-23లో రూ.220.82 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో 70 శాతం మేర ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.417.76 కోట్లతో ప్రతి మండలంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నివారణ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది.
ప్రభుత్వ చర్యలతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరిలో విశాఖ, విజయవాడ, తిరుపతి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. 
♦ విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ‘క్లీనెస్ట్‌ స్టేట్‌/నేషనల్‌ క్యాపిటల్‌’ అవార్డు, 10-40 లక్షల జనాభా కేటగిరిలో విశాఖపట్నం ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డు, సౌత్‌ జోన్‌ (50,000 నుండి ఒక లక్ష జనాభా) కేటగిరీలో పులివెందులకు ‘ఇన్నోవేషన్‌ - బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’ కింద అవార్డులు లభించాయి. మిలియన్‌ ప్లస్‌ ­సిటి కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్‌ ఇంపాక్ట్‌ క్రియేటర్‌’ సిటీగా నిలిచింది.

ఉపాధి నైపుణ్యాల పెంపు
ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే ఉపాధి నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 45,871 కాంట్రాక్టు, 3.72 లక్షల అవుట్‌­సోర్సింగ్‌/ఇతర ఉద్యోగాలు కలిపి మొత్తం 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించింది. 
అవుట్‌­ సోర్సింగ్‌/ గౌరవ వేతన ఆధారిత ఉద్యోగుల జీతాలు పెంచి, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్‌ టైం స్కేల్‌­ను అందిస్తోంది. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 2 దశలలో వైఎస్సార్‌ బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలను నెలకొల్పనుంది.
 
నేరుగా వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ 
♦ విద్యుత్‌ రంగంలో.. విద్యుత్‌ ఖర్చును తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎస్‌ఈసీఐతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌­కు సంబంధించి 800 మెగావాట్లు, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌­కు సంబంధించి 800 మెగావాట్ల పనులను పూర్తి చేసింది. 
రైతులకు స్మార్ట్‌ మీటర్లు బిగించి పారదర్శకంగా నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందిస్తోంది. డీబీటీ విధానం ద్వారా వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

రీ సర్వే అద్భుతం
17,584 గ్రామాల్లో సమగ్ర రీ సర్వేను చేపట్టిన రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 2000 గ్రామాల్లో 4,38,899 మంది ఆస్తి యజమానులకు ‘శాశ్వత భూ హక్కు పత్రాలు’ పంపిణీ అయ్యాయి. ఈ విషయమై నీతి ఆయోగ్‌ నుంచి ప్రశంసలు అందుకుంది. 

రాజకీయ సాధికారతో సామాజిక న్యాయం
మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం పదవులను, రెండో విడతలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో (80 శాతం) నాలుగు పోస్టులను వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం. 
13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో తొమ్మిదింటిని (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ్ చట్టం చేశాం. ఇందులో భాగంగా 137 వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులలో (58 శాతం) వీరినే కూర్చోబెట్టాం. 
56 బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ, ఒక ఎస్టీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వెనుబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. ‘జగజ్జీవన జ్యోతి’ పథకం కింద 15.14 లక్షల ఎస్సీ, 4.5 లక్షల ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌­ను అందిస్తున్నాం.
 
ఇంకా ఎన్నెన్నో..

♦ వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల సంఖ్యను 26కు, రెవెన్యూ డివిజన్‌లు 76కు, పోలీసు డివిజన్లను 108కి పెంచాం. 1956 తర్వాత తొలిసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.  
♦  ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం అమలు చేస్తున్నాం. దీనికి నీతి ఆయోగ్‌ ప్రసంశలు లభించాయి.  
 గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సచివాలయ స్థాయిలో పరిష్కరించడానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. 
  9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేస్తున్నాం.  
నేరాల నియంత్రణలో భాగంగా తీసుకున్న వినూత్న పోలీసింగ్‌ చర్యలు శాంతియుత వాతావరణానికి దోహదపడ్డాయి. మహిళల భద్రత, రక్షణకు దిశ బిల్లు తెచ్చాం.  
రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తాం.
♦ రాష్ట్రం ఎగుమతుల్లో 2019-20లో 7వ ర్యాంకులో ఉంది. 2020-21 నాటికి 16.08 బిలియన్‌ డాలర్లతో నాల్గవ ర్యాంకుకు చేరుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జాతీయ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను అందిస్తోంది. దీనిని 2030 నాటికి 10 శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందిస్తోంది.
♦ రూ.4,994 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ రోడ్లు ప్రాజెక్టు చేపట్టాం. గత ఏడాది పీఎంజీఎస్‌వై కింద రూ. 502 కోట్ల వ్యయంతో 992 కిలోమీటర్ల తారు రోడ్లు వేశాం. ఈ ఏడాది 1,236 కిలోమీటర్లు మేర 174 రోడ్లను, 21 వంతెనలను పూర్తి చేయనున్నాం.
♦ రూ.2,173 కోట్ల వ్యయంతో 5,181 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు ప్రభుత్వం చేపట్టింది. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహాయంతో రూ.3,013 కోట్ల అంచనా వ్యయంతో 1,260 కిలోమీటర్ల రోడ్ల పనులు నడుస్తున్నాయి.
 ♦ దేశంలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత అత్యాధునిక సాంకేతికత సాయంతో గ్రామాల్లో రీసర్వే చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top