స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లకు సువర్ణావకాశం

Golden opportunity for special deputy collectors - Sakshi

13 మంది డీఆర్వోలుగా, 21 మంది ఆర్డీవోలుగా నియామకం 

కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో కీలక పోస్టులు

కర్నూలు(సెంట్రల్‌): కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌డీసీలు)/రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ (ఆర్డీవో) స్థాయి అధికారులకు సువర్ణావకాశం లభించింది. గతంలో అన్ని అర్హతలు ఉన్నా వారు లూప్‌లైన్‌ పోస్టుల్లో పనిచేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణతో కోరుకున్న పోస్టులు దక్కడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వరకు రాష్ట్రంలో 13 జిల్లాలు, 51 రెవెన్యూ డివిజన్‌లు ఉండేవి. అందులో 13 కలెక్టరేట్లకు 13 మంది జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు), 51 డివిజన్లకు 51 మంది ఆర్డీవోలు ఉండేవారు.

ఇక మిగిలినవారు అదే క్యాడర్‌లో ఉన్నా లూప్‌లైన్‌ పోస్టుల్లో పనిచేస్తుండేవారు. లూప్‌లైన్‌ పోస్టులు అంటే.. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, జాతీయ రహదారులు తదితర విభాగాలకు ఎస్‌డీసీలుగా పనిచేయడం. సాధారణంగా రెవెన్యూ డివిజన్‌కు ఆర్డీవోగా పనిచేయడానికి అధికారులు ఎక్కువ మక్కువ చూపుతారు. అదే సమయంలో డీఆర్వోలుగా పనిచేయడానికి ఇష్టపడతారు. అయితే ఆ అవకాశం కొందరికే వస్తుంది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 13 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడంతో ఎంతోమంది అధికారులు తాము కోరుకున్న పోస్టులను దక్కించుకోగలిగారు. 13 జిల్లాలకు 13 మందికి డీఆర్వోలుగా, 21 రెవెన్యూ డివిజన్లకు 21 మందికి ఆర్డీవోలుగా పోస్టింగ్‌లు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒకటి, రెండేళ్లలో పదవీ విరమణ చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారు తమకు డీఆర్వో, ఆర్డీవో స్థాయి క్యాడర్‌ రాదనుకొని నిరాశలో ఉన్న సమయంలో మంచి పోస్టులు దక్కడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top