‘హాల్‌మార్క్‌’ తప్పనిసరి ఉత్తర్వులపై స్టే ఇవ్వండి 

Gold Silver and Diamond Merchants Association Petition in High court on Halmark - Sakshi

హైకోర్టులో బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం పిటిషన్‌  

సాక్షి, అమరావతి: బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ ఏపీ బులియన్‌ బంగారు, వెండి, వజ్రాల వ్యాపారుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, వాటి అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీ విజయకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం ఇచ్చే వివరాల ఆధారంగా మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 6కి వాయిదా వేసింది. 

హాల్‌మార్క్‌ అమలులో అనేక ఇబ్బందులు.. 
అంతకుముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది మువ్వా రవీంద్ర వాదనలు వినిపిస్తూ.. బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమన్నారు. బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ అమలులో అనేక ఇబ్బందులున్నాయని తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 5 లక్షల మంది, రాష్ట్రంలో 50 వేల మంది బంగారు వ్యాపారులు ఉన్నారు. హాల్‌మార్క్‌ ముద్రించాల్సిన ఆభరణాల సంఖ్య దాదాపు 1,000 కోట్లు ఉంటుంది. హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువు ఈ ఏడాది జూన్‌ 15తో ముగిసింది. హాల్‌మార్క్‌ లేకుండా ఆభరణాలు అమ్మినవారికి జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. హాల్‌మార్క్‌ వేసే కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలో పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా, లాక్‌డౌన్‌ వల్ల కేంద్రం నిర్దేశించిన గడువులోపు ఆభరణాలకు హాల్‌మార్క్‌ వేయించడం అసాధ్యంగా మారింది. హాల్‌మార్క్‌ వేసిన ఆభరణాలకు మెరుగుపెట్టిస్తే అది పోతుంది. అప్పుడు ఏం చేయాలనే దానికి ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి స్పష్టత లేదు’ అని రవీంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.  

వినియోగదారుల ప్రయోజనాల కోసమే.. 
కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. వినియోగదారుల ప్రయోజనాల కోసం ఆభరణాల నాణ్యత, శుద్ధత, మోసాలను అరికట్టడం కోసం కేంద్రం హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసిందన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top