మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత | Former Minister Gade Venkat Reddy Passes Away | Sakshi
Sakshi News home page

మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

May 30 2026 6:18 AM | Updated on May 30 2026 6:18 AM

Former Minister Gade Venkat Reddy Passes Away

హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన నేత

1967లో తొలిసారి పర్చూరు నుంచి అసెంబ్లీకి ఎన్నిక

నేదురుమల్లి, కోట్ల, వైఎస్, రోశయ్య మంత్రివర్గాల్లో స్థానం

నేడు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరుకు భౌతికకాయం

పావులూరులో రేపు అంత్యక్రియలు

పర్చూరు (చినగంజాం): సీనియర్‌ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి (87) శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో  తుదిశ్వాస విడిచారు. ఆయనకు సతీమణి వీరాంజనేయమ్మ, కుమారులు గాదె మధుసూదన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా)లోని ఇంకొల్లు మండలం పావులూరులో 1938 నవంబరు 30న గాదెవెంకటరెడ్డి జన్మించారు. ఎల్‌ఎల్‌బీ చదివిన ఆయన కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
కాంగ్రెస్‌లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గాదె వెంకటరెడ్డి 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972, 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీచేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ విజయం తరువాత నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో పర్చూరు నుంచి పోటీచేసిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నియోజక­వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 

బాపట్ల శాసనసభ్యుడిగా గెలిచిన ఆయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో దేవదాయ­శాఖ మంత్రిగా పనిచేశారు. 1967లో ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానంలో 2009 వరకు పోటీలో ఉండడం విశేషం. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో ఆయన పోటీచేయలేదు. 2016లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2020లో వైఎస్సార్‌సీపీలో చేరారు. న్యాయవాదిగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రస్థానం కొనసాగింది. పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఉన్నతస్థాయి నాయకుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు అందరినీ పేరుతో ఆప్యాయంగా పిలిచేవారు. 

ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా చెప్పేవారు. కాగా, హైదరాబాద్‌లో గాదె వెంకటరెడ్డి భౌతికకాయానికి సీనియర్‌ నాయకులు కేవీపీ రామచంద్రరావు, డీకే సమరసింహారెడ్డి, మైసూరారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి తదితరులు నివాళులరి్పంచారు. వెంకటరెడ్డి భౌతికకాయాన్ని శనివారం మధ్యాహా్ననికి ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరుకు తీసుకొస్తామని ఆయన పెద్ద కుమారుడు, వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో కొన­సాగుతూ ప్రజలకు సేవలందించిన గాదె వెంకటరెడ్డి మరణం రాజకీయ రంగానికి తీర­ని లోటని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తన­దైన ముద్ర వేశారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారని కొని­యాడారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో గాదె వెంకటరెడ్డికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉందని వైఎస్‌ జగన్‌ గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్‌తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్‌ పా­ర్టీలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నా­రు. గాదె వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్‌ జగన్‌ ప్రగాఢ సానుభూతి తెలి­పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement