మెడికల్‌ మాఫియాపై ఫోకస్‌

Focus on medical mafia - Sakshi

కర్ణాటక నుంచి ఏపీకి అక్రమంగా సరఫరా అవుతున్న ‘వైద్యుల సూచనల మేరకు వినియోగించే మందులు’ 

డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారుల తనిఖీలలో వెలుగు చూసిన అక్రమ దందా

రూ.16 లక్షల విలువ చేసే అబార్షన్‌ కిట్లు, నిద్ర మాత్రలు, వయాగ్రా స్వాధీనం

ఏపీ నుంచి కర్ణాటక వెళ్లనున్న ప్రత్యేక బృందాలు

సాక్షి, అమరావతి/తణుకు: వైద్యుల రాసిచ్చే చీటీల (డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌)పై మాత్రమే విక్రయించాల్సిన మందులు బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడాన్ని ఔషధ నియంత్రణ విభాగం తీవ్రంగా పరిగణిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన వ్యాపారి ఒకరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోగా.. అతడికి నిద్రమాత్రలు ఎక్కడ లభించాయనే దానిపై ఔషధ నియంత్రణ శాఖాధికారులు దృష్టి సారించారు.

పలుచోట్ల తనిఖీలు నిర్వహించగా.. వైద్యుల చీటీలపై మాత్రమే విక్రయించాల్సిన అబార్షన్‌ కిట్లు, నిద్ర మాత్రలు, వయాగ్రా మాత్రలను విచ్చలవిడిగా విక్రయిస్తున్న వైనం వెలుగుచూసింది. వైద్యుల సూచనల మేరకు మాత్రమే వాడాల్సిన ఈ మందులు కర్ణాటక నుంచి మన రాష్ట్రంలోకి అక్రమంగా సరఫరా అవుతున్నట్టు ఔషధ నియంత్రణ విభాగం అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తణుకు, ఏలూరు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ల పరిధిలో అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.16.41 లక్షల విలువైన అబార్షన్‌ కిట్లు, వయాగ్రా, మత్తు మందులను సీజ్‌ చేశారు. ఐదుగురిపై కేసులు కూడా నమోదు చేసిన అధికారులు ఈ వ్యవహారంపై విస్తృతస్థాయి దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటక నుంచి సరఫరా
ఇలాంటి మందులను నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్‌ రిటైల్‌ మందుల దుకాణాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఉన్న వ్యక్తులకు మాత్రమే విక్రయించాలి. లేదంటే ఆ మందుల దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. కర్ణాటక నుంచి అనధికారికంగా రాష్ట్రంలోకి సరఫరా అవుతున్న ఇలాంటి మందులను ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ముఠా సభ్యులు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. మందులపై ఉన్న ఎమ్మార్పీ ధరలను చెరిపేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.

అధికారులు కేసు నమోదు చేసిన ఐదుగురిలో ఒక వ్యక్తి కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, తుముకూరు, బీదర్‌ నుంచి ఈ మందులను తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడు. నిందితుడి బ్యాంక్‌ లావాదేవీలు, ఫోన్‌ కాల్స్, ఇతర సాంకేతిక వివరాల ఆధారంగా అధికారులు ఈ విషయాన్ని నిర్థారించుకున్నారు. దీంతో కర్ణాటక నుంచి అనధికారికంగా రాష్ట్రంలోకి మందుల సరఫరా వ్యవహారాన్ని ఆ రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు ఇప్పటికే తెలియజేసినట్టు సమాచారం.

తదుపరి విచారణ కోసం బెంగళూరు, హుబ్లీ, తుముకూరు, బీదర్‌ ప్రాంతాలకు పంపేందుకు రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ బృందాల్లో పోలీసులు సైతం ఉంటారు. 

పల్నాడు జిల్లా నుంచి కూడా..
మరోవైపు పల్నాడు జిల్లా నుంచి కూడా నాలుగు రకాల మందులు సరఫరా అయినట్టు విచారణలో తేలింది. ఆ మందులను సరఫరా చేసిన వ్యక్తిని విచారించగా చిలకలూరిపేట, నరసరావుపేటల్లోని రెండు మెడికల్‌ షాపుల నుంచి అనధికారికంగా కొనుగోలు చేసి సరఫరా చేసినట్టు వెల్లడించాడు. దీంతో చిలకలూరిపేట, నరసరావుపేటల్లోని సంబంధిత రెండు మెడికల్‌ షాపుల్లో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రెండుచోట్ల సుమారు రూ.60 లక్షల వరకూ విలువ చేసే మందులను అనధికారికంగా విక్రయించినట్టు గుర్తించారు. దీంతో ఆయా షాపుల యజమానులపై కేసులు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top