స్టేషన్‌కి చేరిన దున్నపోతు పంచాయితీ! మాదంటే..మాది అని గొడవ

Fire Broke Between Two Villages For Ploughing At Kanekal Ananthapur - Sakshi

ఉండేది ఒకేఒక్క దేవర దున్నపోతు.. రోజుల వ్యవధిలో రెండు గ్రామాల్లో దేవర (జాతర) ఉంది. దేవరపోతు లేకుంటే జాతరే జరగదు. ఊరి దేవర చేయకపోతే గ్రామానికి అరిష్టమని అందరూ భావిస్తున్నారు. దీంతో ఉన్న ఒక్క దేవరపోతును వదులుకునేందుకు రెండు గ్రామాల ప్రజలు ఇష్ట పడడం లేదు. దీంతో ఆ దున్నపోతు తమదంటే.. తమదంటూ గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ అంశాన్ని రెండు గ్రామాల పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది.      

సాక్షి, కణేకల్లు: కణేకల్లు మండలానికి పడమట అంబాపురం, ఉత్తరాన రచ్చుమర్రి గ్రామాలున్నాయి. పదేళ్లకోసారి ఊరి దేవర జరపడం ఈ రెండు గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఊరి దేవర జరిగిన నెల తర్వాత అమ్మవారి పేరున ఓ మూడు నెలల వయసున్న దున్నపోతును కొనుగోలు చేసి వదులుతుంటారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం ఈ రెండు గ్రామాల్లోనూ ఊరి దేవర ముగిసిన తర్వాత మళ్లీ దున్నపోతును అమ్మవారి పేరున వదిలేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్రామాల్లో ఊరి దేవరకు గ్రామస్తులు పెద్త ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.  

పట్టుదలకు పోయిన గ్రామ పెద్దలు.. 
ఈ నెల 17న అంబాపురంలో, మరో రెండు నెలల్లోపు రచ్చుమర్రిలో ఊరి దేవర నిర్వహించాలని గ్రామ పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో తాము అమ్మవారి పేరుతో వదిలిన దేవర దున్నపోతు కోసం అంబాపురం గ్రామస్తులు నెల రోజులుగా వివిధ ప్రాంతాల్లో గాలించి, చివరకు బొమ్మనహాళ్‌ మంలడం కొలగానహళ్లిలో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లి గ్రామంలోని బందులదొడ్డిలో బంధించారు. విషయం తెలుసుకున్న ఉద్దేహాళ్‌ గ్రామస్తులు అంబాపురానికి చేరుకుని బందులదొడ్డిలో ఉంచిన దున్నపోతును గమనించి, అది తమదని వాదనకు దిగారు. అయితే ఆ పోతు తమదేనంటూ అంబాపురం వాసులు నచ్చచెప్పడంతో వారు వెనుదిరిగారు.

ఈ సమస్య సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో రచ్చుమర్రి గ్రామస్తులొచ్చి పోతు తమదేనంటూ భీష్మించారు. తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ అంబాపురం గ్రామ పెద్దలను నిలదీశారు. వారం రోజులుగా ఇరు గ్రామాల మధ్య ఈ వివాదం చెలరేగుతూ వస్తోంది. ఇరు గ్రామాల పెద్దలు పట్టుదలకు పోయి విశ్వ ప్రయత్నాలు చేస్తుండడంతో పలు మార్లు పంచాయితీలూ జరిగాయి. ఎవరూ రాజీ పడలేదు.

ఊరి దేవరకు తేదీ నిశ్చయించుకున్నామని, ఊరంతా సంబరాలకు సిద్ధమైన తరుణంలో ఇలా ఘర్షనకు దిగడం సరికాదంటూ అంబాపురం వాసులు అంటున్నారు. అయితే ఈ పోతును వదులుకుంటే రెండు నెలల్లోపు తమ గ్రామంలో ఊరి దేవర ఎలా జరుపుకోవాలంటూ రచ్చుమర్రి వాసులు నిలదీస్తున్నారు. దీంతో పోతును వదులుకునేందుకు ఇరు గ్రామస్తులూ సిద్ధంగా లేకపోవడంతో వివాదం మరింత ముదిరింది.   

స్టేషన్‌కు చేరినా తెగని పంచాయితీ.. 
చివరకు దేవర పోతు సమస్య కణేకల్లు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. రెండు గ్రామాల పెద్దల మధ్య సఖ్యత కుదిర్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ పోతు తమదంటే తమదంటూ స్టేషన్‌లోనే రెండు గ్రామాల ప్రజలు మొండిగా వాదనకు దిగారు. దీంతో ఎవరికీ సర్ది చెప్పలేక పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. పోతు కోసం తాము ఎందాకైనా పోతామంటూ ఒకరిపై మరొకరు సవాల్‌ విసురుకుంటున్నారు. ఈ క్రమంలో అంబాపురంలో రేయింబవళ్లూ దున్నపోతుకు యువకులు పహారా కాస్తున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తుల కదలికలపై పటిష్ట నిఘా వేశారు.  

(చదవండి:

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top