సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌

Finland was named the world's happiest country - Sakshi

ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రపంచంలో సంతోషకర దేశాల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ దేశాల ఎంపికకు తీసుకుంటున్న ప్రమాణాలపై పలు అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ జాబితాపై అంతా ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రపంచ సంతోషకర దేశాల (హ్యాపీనెస్‌ ఇండెక్స్‌) జాబితాలో భారత్‌ 126వ స్థానంలో నిలిచింది.

ఈ జాబితా కోసం మొత్తం 150 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే సంతోషకర దేశాలుగా నార్డిక్‌ దేశాలుగా పేరున్న ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఐస్‌లాండ్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో ఆప్ఘనిస్థాన్‌ నిలిచింది. మొత్తం 10 పాయింట్లకుగాను తొలిస్థానంలో నిలిచిన ఫిన్‌లాండ్‌కు 7.8 పాయింట్లు లభించాయి. మన దేశానికి కేవలం 4.6 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇక అట్టడుగున నిలిచిన ఆఫ్ఘనిస్థాన్‌కు 1.9 పాయింట్లు మాత్రమే వచ్చాయి. 

సంతోషానికి కొలమానం ఏమిటి?
ఇది అత్యంత క్లిష్టమైన ప్రశ్న. మనిషి ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కొలమానం ఏమీ లేదు. సంపదకు, సంతోషానికి ప్రత్యక్ష సంబంధం లేదని సంతోష సూచీ ఫలితాలనుబట్టి చూస్తే అర్థమవుతుంది. సైనిక, ఆర్థిక వ్యవ­స్థల పరంగా పెద్ద దేశాలైన అమెరికా, చైనా టాప్‌–­10లో లేకపోవడం గమనార్హం.

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం కంటే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్‌.. సంతోష సూచీలో ముందుండటంగమనార్హం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ.. సంతోష సూచీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నివేదిక రూపకర్తలు అభి­ప్రాయపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం లేని దేశాలు కూడా సంతోష సూచీలో మెరుగైన స్థానాలు సంపాదించడం గమనార్హం.

ఈ అంశాల ఆధారంగా నివేదిక
‘యూఎన్‌ సస్టైన్‌బుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌’.. ఏటా సంతోష సూచీ నివేదిక రూపొందిస్తోంది. మార్చి మూడో వారంలో ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజా నివేదికను ఇటీవల విడుదల చేసింది.

జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నారు? అనే తొలి ప్రశ్నతో మొదలుపెట్టి, ప్రజల సంతృప్తస్థాయి, ఆరోగ్యకర జీవనం, విద్య, వైద్య రంగాల్లో నాణ్యత, భద్రత, తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, అతి తక్కువ అవినీతి, సమాజంలో ఔదార్యం.. వంటి ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబుల ఆధారంగా సూచీని రూపొందించారు.

నివేదికపై భిన్నాభిప్రాయాలు
భారతీయ సమాజంలో సంక్లిష్టతను పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోలేవని, ఒకే రకమైన కొలమానంతో మన దేశ ప్రజల సంతోషాన్ని కొలవడంలో అర్థం లేదనే అభిప్రాయాలు వ్యక్తమ­వుతున్నాయి.

కుటుంబంతో కలిసి సంవత్సరానికి ఎన్నిసార్లు భోజనం చేశారు? అనే ప్రశ్న అడిగితే పాశ్చాత్య దేశాలు సంతోష సూచీల్లో వెనుకబడి ఉంటాయని ప్రముఖ సినీ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (ది కాశ్మీర్‌ ఫైల్స్‌ ఫేమ్‌) ప్రశ్నించడం గమనార్హం. దీనిపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన అభిప్రాయంతో కొందరు ఏకీభవిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. 

యుద్ధం చేస్తున్నా ఆనందంగానే..
కాగా ఏడాదికిపైగా రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరు­గుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ తీవ్రంగా దెబ్బతింది. అయినా సరే సంతోష సూచీలో మెరుగైన స్థానంలోనే ఉంది. గతేడాది 98వ స్థానంలో ఉన్న ఉక్రెయిన్‌ తాజా నివేదికలో 92కు చేరింది.

దేశం కోసం స్వచ్ఛంద సేవ చేయడం, వివిధ రూపాల్లో రోజూ కరుణ చూపడం, తోటి ప్రజలకు సహాయం అందించడం, ఉన్నంతలో పొరుగు­వారికి పంచడం, ఒకరికోసం ఒకరు నిలబడటం, యుద్ధంలో గాయపడిన వారికి సేవలు చేయడం.. ఇవన్నీ ప్రజల్లో సంతృప్తస్థాయిని పెంచాయని సంతోష సూచీ రూపకర్తల్లో ఒకరైన లారా అక్‌నిన్‌ నివేదికలో పేర్కొనడం గమనార్హం.

గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడ్డ భారత్‌ ర్యాంక్‌
కాగా గతేడాది నివేదికలో మన దేశానికి 136వ స్థానం దక్కగా ఈ సంవత్సరం కాస్త మెరుగుపడి 126వ స్థానానికి చేరింది. సంతోషకర దేశాల జాబితాలో మన దాయాది పాకిస్తాన్‌ 108, ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక 112, బంగ్లాదేశ్‌ 118 స్థానాల్లో నిలిచాయి.

నేపాల్‌ 78వ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) గణాంకాలను రూపొందిస్తుండగా.. గ్రాస్‌ నేషనల్‌ ఇండెక్స్‌ రూపొందిస్తున్న భూటాన్‌ను ప్రపంచ సంతోష సూచీలో పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top