
ఆత్మహత్యాయత్నం చేసిన చౌడప్ప
కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగిన రైతు
కన్నీరుమున్నీరైన బాధితుడి భార్య
అధికారబలంతో భూమి రాసివ్వాలని దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన
ఇప్పటికే ఏమార్చి రెండెకరాలు రాయించుకున్నారని ఆక్రోశం
అధికారులకు విన్నవించుకున్నా న్యాయం జరగడం లేదని ఆక్రందన
చిత్తూరు కలెక్టరేట్ : టీడీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన రైతు చౌడప్ప సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి అధికారులు, సిబ్బంది హతాశులయ్యారు. వెంటనే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది రైతుకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుడి భార్య శ్యామలమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడును విలేకరుల ఎదుట వెళ్లబోసుకున్నారు.
ఆమె కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన చౌడప్ప పేరుతో ఉన్న భూమిని రాసివ్వాలంటూ టీడీపీ నేత కృష్ణమూర్తిగౌడ్ అధికారబలంతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికే రైతును ఏమార్చి రెండెకరాలు రాయించుకున్నాడు. చౌడప్పకు రెండెకరాల డీకేటీ భూమి ఉండగా అందులో కొంత పక్కవాళ్లకు చెందుతుంది. దీనిని సర్వే చేసి తమకు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో చౌడప్ప నగదు చెల్లించారు. అయితే టీడీపీ నేత అధికారబలంతో సర్వే సిబ్బందిని రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు.
న్యాయం చేయాలని తహసీల్దార్, కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పదిసార్లు వచి్చనా అధికారులు పట్టించుకోలేదు. చివరిసారిగా సోమవారం మరోమారు అర్జీ ఇద్దామని భార్యతో కలిసి చౌడప్ప వచ్చాడు. అయినా అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చౌడప్ప కలెక్టర్ ఎదుటే బ్యాగులో తెచ్చుకున్న పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. ప్రస్తుతం చౌడప్ప చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.