Fact Check: ‘ప్రాజెక్టుకు పైసల్లేవ్’ పేరుతో అసత్య కథనం.. వాస్తవాలివిగో

Fact Check: Eenadu Propaganda On Projects Of AP - Sakshi

సాక్షి, అమరావతి: పచ్చ మీడియా మరోసారి విష ప్రచారానికి దిగింది.  ‘ప్రాజెక్టుకు పైసల్లేవ్’ పేరుతో అసత్య కథనాన్ని వండి వార్చింది. పచ్చ పార్టీ నాయకుడు చంద్రబాబుకు మేలుచేసేలా అబద్దపు రాతలతో ఈనాడు పేపర్‌ ఫ్రంట్‌ పేజీలో అచ్చొత్తింది.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలపై నిజాలను తొక్కిపెట్టి ప్రజల కళ్లకు కంతలు కట్టేందుకు నిసిగ్గుగా ప్రయత్నిస్తోంది ఎల్లో మీడియా. ‘ఈనాడు’ అబద్దాలకు ఇదిగో సమాధానం..

ఆరోపణ : గతంలో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంతో జరిగితే, నేడు పూర్తిగా నిలిచిపోయాయి. టీడీపీ రూ.68,293 కోట్లు ఖర్చు పెట్టింది - 23 ప్రాజెక్టులు పూర్తి చేసింది - 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరందించడం జరిగింది. 

►ఈనాడుకు వాస్తవాలు వక్రీకరించడం వెన్నతో పెట్టిన విద్య. రకరకాల పథకాలు అంటే ఫారెస్ట్, గ్రామీణాభివృద్ధి వాటి క్రింద పెట్టిన ఖర్చు కూడా ప్రాజెక్టుల క్రింద చూపించారు. 2015-19  సంవత్సరాలలో జరిగిన ఖర్చు రూ. 55393 కోట్లు. ఇచ్చిన ఆయకట్టు 2,13,623 ఎకరాలు మాత్రమే.

►దీనిలో పోలవరం ఖర్చు రూ. 10584 కోట్లలో దాదాపు రూ 10,000 కోట్లు కేంద్రం నిధులే.

►దీనిలో ఎన్నో వృధా ఖర్చులు, పట్టిసీమ రూ.1615 కోట్లు, పురుషోత్తపట్నం రూ. 1578 కోట్లు లిప్ట్ స్కీం లకు పెట్టినవి ఉన్నాయి. 

►పోలవరం 2018 లో పూర్తి చేస్తామని శపథాలు చేసి 2017 లో పురుషోత్తపట్నం మీద రూ 1578 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ఎడమ కాలువకు నీరు ఇవ్వాలనుకోవడం ఎంత అవివేకం. ఈ పథకాలు జేబులు నింపుకోవడానికే చేపట్టినట్లుగా తేటతెల్లం అవుతుంది. 

►పైగా పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ పథకాల వలన ఇప్పటి ప్రభుత్వాలకు గుది బండగా మారాయి.

►ఎన్‌జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కోర్టు దాదాపు రూ.250 కోట్ల రూపాయలు పర్యావరణ రుసుము క్రింద పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడి మరియు పోలవరం ప్రాజెక్టు లకు కలిపి కట్టమని తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు లో మేము పోరాడవలసి వస్తుంది. 

►ఇలాంటివే ఎక్కువ భాగం. ఇవి  మచ్చుకు ఉదాహరణలు మాత్రమే.

►ఇంకా నీరు చెట్టు క్రింద పెట్టిన ఖర్చు దాదాపు 10 వేల కోట్ల రూపాయల లో జరిగిన అవినీతి సంగతి అందరికీ తెలిసిందే. అవి వారి కార్యకర్తల కోసం చేపట్టినవి అని, మన బిల్స్ పూర్తిగా చంద్రబాబు చెల్లించకుండా కార్యకర్తల్ని మోసం చేశారు అని వారి నాయకులే చెప్పుకుంటున్నారు. 

►ఈ భారం ఈ ప్రభుత్వం మోస్తున్నది. జరగని పనులకు బిల్లులు చెల్లించలేక, కోర్టుల చుట్టూ అధికారులు తిరగలేక సతమవుతున్నారు. 

►ఇన్ని డబ్బులు ఖర్చు చేసి గత ప్రభుత్వంలో పూర్తిచేసిన ప్రాజెక్టులు రెండే రెండు. అవి రెండు కూడా  పైన చెప్పిన రెండు తాత్కాలిక పథకాలు. 

►ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా (12 /22) 23,289 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కోవిడ్ మహమ్మారి వలన దాదాపు 18 నెలలు పనులు జరగక పోవడం,  రాష్ట్ర ఆర్థిక వనరులు కుంటు పడటం వలన ఖర్చు తక్కువ అవడానికి ప్రధాన కారణం.

►ఉన్న పరిమిత వనరులను, మంచి ప్రణాళికలో తక్కువ ఖర్చుతో సత్వరం పూర్తి అయ్యే ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది. 

ఈ ప్రభుత్వము లో ఇచ్చిన ఆయకట్టు 1,03,692 ఎకరాలు. విస్తీరీకరణ కింద 4,84,500 ఎకరాలు ఇవ్వడము జరిగినది. దాని వలనే దశాబ్దకాలం నుండి పెండింగ్ లో ఉన్న నెల్లూరు బ్యారేజి , సంగం బ్యారేజి  పనులు పూర్తి చేయగలిగాము. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెలు పూర్తి చేశాము. రెండవ టన్నెలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి, 2024 జూన్ లోపు నల్లమల సాగర్ నింపి ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరుగుతుంది. రివర్స్ టెండరింగ్:  రివర్స్ టెండరింగ్ ఈ ప్రభుత్వం టెండరింగ్ విధానంలో తెచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు. దీని వలన ఎంతో ప్రజాధనం ఆదా అయింది. ఒక్క పోలవరం లోనే 865 కోట్లు ఆదా అయింది. అన్ని ప్రాజెక్టులు కలిపి దాదాపు 2090 కోట్ల ప్రజాధనం ఆదా చేయగలిగాము. ఇంత మంచి ఉద్దేశాన్ని కూడా విమర్శించడం దిగజారుడుతనం అవుతుంది. 

దివంగత నేత వైఎస్సార్‌ దూర దృష్టితో రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్పట్టిన జలయజ్ఞంను తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ధనయజ్ఞంగా మార్చుకోవడంలో టిడిపి వారు సిద్ద హస్తులమని నిరూపించుకున్నారు. G.O No.22 & 63 లు ఇచ్చి ప్రజాధనాన్ని స్వాహా చేశారు. ఇవి ఇచ్చిన ఉద్దేశ్యం మాత్రం నెరవేరలేదు, పట్టిసీమ, పురుషోత్తపట్నం లాంటి తాత్కాలిక, స్వార్ధపూరిత పథకాలని ప్రోత్సహించారు,  నీరు చెట్టు లో జరిగిన అవినీతితో సాగునీటి రంగం గత ప్రభుత్వంలోనే భ్రష్టు పట్టించారు. ఈ ప్రభుత్వానికి దానిని గాడి లో పెట్టడం పెద్ద టాస్క్ అయిపోయింది.

బిల్లులు చెల్లించక నానా  ఆగచాట్లు: ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేనాటికే దాదాపు 20,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో వున్నవి. అవన్నీ ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరుపుకుంటూ వస్తున్న క్రమం లో కోవిడ్ మహమ్మారి వలన రాబడి తగ్గిపోయి, ప్రజల కనీస అవసరాలకు నిధులు సింహ భాగం కేటాయించడం వలన , బిల్లులు చెల్లింపులలో 2020-21, 2021-22 లో కొంత జాప్యము జరిగిన మాట వాస్తవమే.  

పోలవరం: ఈనాడు / టీడీపీ వారు పోలవరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది.  పోలవరంలో టీడీపీ వారు చేసిన ఘోర తప్పిదాల వలన ఈ రోజు పొలవరo  మెయిన్ Earth Cum Rock Fill డ్యామ్ కట్టడం లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతునాయి. 
ఎగువ కాఫర్ డ్యామ్ లో  2018-19 లో వదిలిన ఇరుకు గ్యాప్ ల వలన 2019,2020 ల లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, డ్యామ్ ఏరియా లో ఇసుక washout అయిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇంత వరకు వీటికి సరిచేసే విధానాలను CWC, NHPC, IIT లో ని Technocrats నిమగ్నం అయి ఉన్నారు. 
పోలవరం మీద పెట్టిన ఖర్చును కేంద్రం నుండి రాబట్టు కోవటం లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి కారణం గత ప్రభుత్వం 2013-14 అంచనాలతో  కేంద్ర కేబినెట్ లో పెట్టినపుడు చూపిన నిర్లక్ష్యం కారణం. 

ఇంకా గోదావరి నదికి ఎన్నడూలేని విధంగా జులై నెలలో అత్యధిక వరదలు రావడం కొంత ప్రణాళిక ను దెబ్బతీసింది. అందువలనే దిగువ కాఫర్ డామ్ పనులు కొంత ఆలస్యము అయినవి. ఇప్పుడు దిగువ కాఫర్ డామ్ పనులు వేగంగా జరుగుతున్నవి. CWC వారు డీజయన్లు ఇవ్వగానే, ప్రాజెక్టు ను పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది.

పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు:
గత ప్రభుత్వ కాలములో దుర్భిక్ష ప్రాంతమైన ప్రకాశం జిల్లా అవసరాలను కూడా గుర్తించక వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం జరిగినది. ఆ ప్రాజెక్టులో భాగమైన పునరావాస        కార్యక్రమాలలను పూర్తిగా విస్మరించడం జరిగినది. టన్నెల్ పనులను తమ గుత్తేదారులకు ఇప్పించుకొనుటకు గాను అప్పటి గుత్తేదారులను సాగనంపి అధిక ధరలకు అస్మదీయ గుత్తేదారులకు కట్టబెట్టం జరిగింది మరియు సదరు గుత్తేదారులు చిన్న చిన్న సాకులు చూపి పనులు నత్త నడకన చేసినను త్వరితగతిన పూర్తి చేయుటకు అప్పటి ప్రభుత్వము ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వము చిత్త శుద్ధితో ప్రణాళిక బద్ధముగా పై పనులను పూర్తి చేయుటకు సంకల్పించింది. అందులో భాగముగా వెలిగొండ టన్నెల్- 1 పూర్తి చేయడం జరిగినది. అదే విధముగా టన్నెల్-2 కూడా జూన్ 2023 నాటికి పూర్తి చేసి, ఆ ఖరీఫ్ పంట కాలములో పూర్తి స్థాయిలో నీటి విడుదలకు ప్రణాళికాబద్ధముగా పనులు జరుగుతున్నవి.   

వంశధార రెండవ దశ , మహేంద్రతనయ 
పూర్తిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం ప్రాంతాలలో రాష్ట్రములోని అత్యధిక వర్షపాతము నమోదు అయినప్పటికీ నీటి పారుదల సౌకర్యము అందుబాటులో లేకపోవడముతో ఆ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు, గత ప్రభుత్వము పూర్తి నిర్లక్ష్య దృక్పథముతో ఆ ప్రాంత అవసరాలను విస్మరించి ఏ ప్రాజెక్టును కానీ పూర్తి చేయుటకు సంకల్పించలేదు. ప్రస్తుత ప్రభుత్వము ఆ ప్రాంతములోని వంశధార - నాగావళి నదుల అనుసంధానము మరియు వంశధార రెండో దశ పనులను ప్రాధాన్యతగా గుర్తించి ఈ ఖరీఫ్ సీజన్లో పూర్తి చేసి సాగు నీటిని అందించుటకు ప్రణాళిక బద్ధముగా ముందుకు సాగడం జరుగుతున్నది, అందుకు అవసరమైన అన్ని బిల్లులు చెల్లించి గుత్తేదారులను పనులు పూర్తి చేయుటకు ఆదేశించడమైనది. 

ఉత్తరాంధ్ర ప్రాంతములో మిగిలిన ప్రాజెక్టులైన తారకరామా తీర్థ, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ జలాశయం, తోటపల్లి, గజపతినగరం పనులను కూడా ప్రాధాన్యత క్రమములో త్వరితగతిన పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవడమైనది.  

గాలేరు నగరి, హంద్రీనీవా ప్రొజెక్టులు :
అవుకు కుడి సొరంగ మార్గము నందు 160 మి. fault zone పనిని చేపట్టకుండా గత ప్రభుత్వము విస్మరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వము అందులో 90 మి. fault zone సొరంగమూ పూర్తి చేసి మిగిలిన 70 మి. కూడా ఏప్రిల్  నాటికి పూర్తి చేసి 10 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా అవుకు జలాశయమునకు మరియు రాయలసీమ లోని ఇతర ప్రాంతాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా నీటి లభ్యత చేకూర్చుటకు ప్రణాళికలు, ప్రణాళిక బద్ధముగా పనులు చేపట్టడం జరిగినది. 

గండికోట మరియు చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయములలో  ప్రభుత్వము విస్మరించిన పునరావాస పనులు పూర్తి చేసి  27 టి.ఎం.సి మరియు 10 టి.ఎం.సి. ల పూర్తి సామర్థ్యంతో నింపడం జరిగినది. 

అలాగే బ్రహ్మంసాగర్ జలాశయములోని లీకేజి సమస్యను గత ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యము చేయగా ప్రస్తుత ప్రభుత్వము అతి తక్కువ ఖర్చుతో రూ.60  కోట్లు వెచ్చించి ఆ సమస్యను పరిష్కరించి జలాశయం నందు 17 టి.ఎం.సి. ల పూర్తి సామర్థ్యం వరకు ఈ సంవత్సరం నింపడం జరిగినది.

గత ప్రభుత్వము హంద్రీ నీవా ఫేస్ - 2 లో భాగముగా కుప్పము బ్రాంచ్ కెనాలు ద్వారా పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు నీటిని అందించుటకు అట్టహాసముగా కుప్పము బ్రాంచు కెనాలును రూ.477 కోట్లతో ప్రారంభించి పనులను అస్మదీ యులకు ఇప్పించి, పని విలువను రూ. 622 కోట్లకు పెంచి అందులో లాభ దాయక పనులు మాత్రము చేసి బిల్లులు తీసుకొని అసంపూర్తిగా విడిచి పెట్టడం జరిగినది. ఇప్పుడు ఆ పనులను కూడా ప్రాధాన్యతగా చేపట్టి అనతి కాలములోనే కుప్పము నియోజకవర్గానికి కూడా నీరు ఇచ్చే కార్యక్రమము చేపట్టడం జరిగినది.  

అలాగే రామలింగేశ్వర నగర్ వరద రక్షణ గోడ నిర్మించి విజయవాడ నగరంలోని దాదాపు 50,000 మంది నివసించే ముంపు ప్రాంతాలకు పూర్తి వరద రక్షణ కల్పించింది
కర్నూలు జిల్లాలోని పశ్చిమ మండలాలకు నీటి సరఫరా : 10,130 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు 9 మండలాల్లోని 68 చెరువులకు నీరు అందించేందుకు, HNSS మెయిన్ కెనాల్ 90 వ కిలో మీటర్  వద్ద ఎడమవైపు నుంచి 1.238 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ద్వారా కర్నూలు జిల్లాలోని పశ్చిమ మండలాలకు నీటి సరఫరాను అందించడం మరియు జిల్లా పశ్చిమ ప్రాంతాలలో ప్రజలు & పశువులకు గృహ, పారిశ్రామిక తాగునీటి అవసరాలు  తీర్చబడటానికి, 180.67 కోట్ల విలువైన ఈ పనులు దాదాపు పూర్తిచేయబడి,  పత్తికొండ మరియు డోన్ నియోజకవర్గాల్లో  నీటి సరఫరా చేయుటకు  సిద్ధంగా ఉంది.  

సారాంశము : 
గత ప్రభుత్వము అసంబద్ధముగా పక్కా ప్రణాళిక లేకుండా రూ.55894 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు, కానీ ప్రజలకు చేకూరిన లబ్ది ఏ మాత్రము లేదు. వారి అస్మదీయ గుత్తేదారులకు పనులు కట్టబెట్టి వారికి మరియు వారిద్వారా ప్రభుత్వము లోని పెద్దలకు లబ్ది పొందే కార్యక్రమాలు మాత్రమే చేపట్టారు.  ప్రస్తుత ప్రభుత్వము అనవసర ఆర్భాటాలకు పోకుండా ప్రజాధనాన్ని ప్రజలకు సత్వర లబ్ది చేకూరే విధముగా ప్రాజెక్టులపై అవసరం మేరకే ఖర్చు పెట్టడం జరుగుతున్నది. 

గత రెండు సంవత్సరాలలో రాష్ట్రములోని అన్ని ప్రాంతాలలోను ఎక్కడ రైతులు సాగునీటికి కానీ ప్రజలు త్రాగు నీటికి కానీ ఇబ్బంది పడకుండా నీటిని అందించడం జరిగినది. గత రెండు సంవత్సరాలలో ఖరీఫ్ నందు 114 లక్షల ఎకరాలకు మరియు రబీ నందు 31.10 లక్షల ఎకరాలకు నీరు అందించడమైనది. 

ఈ సంవత్సరం ఖరీఫ్ లో 50.96 లక్షల ఎకరాలకు మేజర్ మరియు మీడియం ప్రాజెక్టుల కింద , 12.12 లక్షల  ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద, 4.95 లక్షల ఎకరాల కు APSIDC కింద మరియు  9.92 లక్షల ఎకరాలకు  భూగర్భ జలాల కింద మొత్తము ఆయకట్టు 77.95 లక్షల ఎకరాలకు  రికార్డు స్తాయి లో  సాగునీరు అందించబడినది.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top