అవన్నీ మామూలే..
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
అయినా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం
వాటిపై వైఎస్సార్‌సీపీ రాద్ధాంతం చేస్తోంది
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై రాజ ద్రోహం కేసు పెట్టాలి
సాక్షి, అమరావతి: ఆలయాల్లో హుండీ లెక్కింపులో, ఇతరత్రా తప్పులు జరుగుతాయని, అవన్నీ మామూలేనని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. అయినా వీటిపై వైఎస్సార్‌సీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, దేవదాయశాఖ సలహాదారులు సీతారామాంజనేయ ప్రసాద్‌లతో కలిసి రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
విజయవాడ దుర్గగుడి, అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయం, పెనుగంచిప్రోలు, పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో రెండేళ్లలో భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆలయ నికర ఆదాయం గతం కన్నా తగ్గడంపై వివరణ ఇచ్చేందుకు సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి.. ఆ మాటే మాట్లాడలేదు. దేవదాయ శాఖ పరిధిలోని 22 పెద్ద ఆలయాల్లో ఉమ్మడిగా ఆదాయం పెరుగుదల గురించి మాత్రమే వివరణ ఇచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి గతంలో 93 లక్షల మంది భక్తులు రాగా, కూటమి ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య ఏకంగా 1 కోటి 19 లక్షల మందికి పెరిగిందని చెబుతూ.. ఆదాయంలో తగ్గుదల విషయాన్ని దాట వేశారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మెరుగైన వసతులు కల్పించడం వల్ల భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. విజయవాడ దుర్గగుడి భూముల్లో కొనసాగుతున్న సిద్ధార్థ విద్యా సంస్థల లీజు గడువు ఏడాది క్రితమే ముగిసిందని, అయితే ఆ విద్యా సంస్థ లీజు గడువు పొడిగించాలని కోరడంతో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గంలో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశ పూర్వక దుష్ప్రచారాలు, సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరిపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


