ఒకేసారి 6,124 మంది సచివాలయ ఉద్యోగులకు డిప్యుటేషన్‌ | Employee Union Leaders fires on Government Decision | Sakshi
Sakshi News home page

ఒకేసారి 6,124 మంది సచివాలయ ఉద్యోగులకు డిప్యుటేషన్‌

Apr 29 2026 6:09 AM | Updated on Apr 29 2026 6:09 AM

Employee Union Leaders fires on Government Decision

ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘ నేతల మండిపాటు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 6,124 మందిని వివిధ ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ అధ్యక్షతన మార్చి 13న వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ నెల 22న అన్ని శాఖలకు చేరాయి. మొత్తం 19 శాఖలకు 10,465 మంది ఉద్యోగులు  అవసర మని ఆయా శాఖలు ప్రభుత్వానికి తెలియ జేయగా.. 6,124 మందిని సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులలో 2వేల మందిని హోంశాఖలో సిటిజన్‌ సర్వీస్‌ ఫెసిలిటేటర్లుగా, మరో 783 మందిని మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్‌ వాత్సల్య విభాగం ఉద్యోగులుగా.. ఇంకో 406 మందిని మెప్మాలో కమ్యూనిటీ కో–ఆర్డినేట­ర్లుగా.. 129 మందిని సెర్ప్‌లో లైవ్లీ హుడ్‌ (జీవనో­పాధుల కల్పన) అసిస్టెంట్లుగా.. 100 మంది మహిళా పోలీసులను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లుగా, 9 మందిని మైనార్టీ శాఖకు డిప్యుటేషన్‌పై పంపాలని ప్రతిపాదించారు.

ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు సైతం..
గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను సైతం వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై పంపించాలని నిర్ణయించారు. వారిలో 430 మందిని గృహ నిర్మాణ శాఖ, 367 మందిని ఆర్‌ అండ్‌ బీ, 250 మందిని ఆర్‌డబ్ల్యూఎస్, 70 మందిని వైద్యశాఖ పరిధిలోని సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఇంకో 50 మందిని విద్యా శాఖలో ఇంజినీరింగ్‌ పనులకు, 20 మందిని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, 10 మందిని టూరిజం ఇంజనీరింగ్‌ పనులకు ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు.

గిరిజన శాఖ పరిధిలోని ఐటీడీఏలో 28 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను, సమగ్రశిక్ష విభాగంలో 113 మంది ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌ విధానంలో నియమించాలని ప్రతిపాదించారు. 562 మంది వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలను పట్టణాభివృద్ది శాఖలో ఇంజినీరింగ్‌ పనుల పర్యవేక్షణకు, 530 మంది వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీలను టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. 140 మంది వార్డు రెవెన్యూ సెక్రటరీలను సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్లు, కేర్‌ టేకర్లుగా, 125 మంది వీఆర్‌ఏలను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ వెల్పేర్‌ ఆఫీసర్లుగా డిప్యుటేషన్‌పై పంపాలని ప్రతిపాదించారు.

సచివాలయాల ఉద్యోగులు కూలీలా..
సచివాలయ ఉద్యోగులను కూలీల మాదిరిగా ఏ శాఖకు కావాలంటే ఆ శాఖకు పంచుతుండటం దుర్మార్గమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యో­గుల సంఘం అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌రజాక్, ప్రధాన కార్యదర్శి శిష్టు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ  నిర్ణయాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను బలహీనపరచడానికి, అస్తవ్యస్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. డిప్యుటేషన్‌పై పంపించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement